Vangaveeti Radhakrishna: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆశావహుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. జనసేన, టీడీపీ పొత్తుతో ఆయా పార్టీల ఆశావహులకు టెన్షన్ మరింత పెరుగుతోంది. ఎవరికి సీటు వస్తుందో.. ఎవరికి సీటుకు ఎసరు పెడతారో తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. తమ పార్టీ నేతలను ఇతర పార్టీల వైపు చూడకుండా కాపాడుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటి నుంచే బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టేశారు.

జనసేన, టీడీపీ పొత్తు చిగురిస్తుందన్న వేళ వంగవీటి రాధాకృష్ణ పేరు వార్తల్లోకి ఎక్కింది. గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ.. 2019లో టీడీపీలో చేరారు. కానీ పోటీ చేయలేదు. కేవలం ప్రచారం చేశారు. విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకపోవడమే ఆయన పార్టీ మారడానికి కారణమైంది. అయితే ఈసారి టీడీపీ వైసీపీ చేసిన తప్ప చేయదని వంగవీటి అభిమానులు భావిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ సీటును వంగవీటి రాధాకృష్ణకు ఇస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ కూడ వంగవీటిని వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు.
వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకపోతే జనసేన వైపు మొగ్గు చూపుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. ఈ వాదనకు నాదెండ్లతో భేటీ బలం చేకూర్చింది. దీంతో అప్రమత్తమైన టీడీపీ విజయవాడ సెంట్రల్ సీటు రాధాకే ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే దీని పై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. టీడీపీ నిర్ణయం పైనే రాధా నిర్ణయం ఆధారపడి ఉంటుందనేది నగ్న సత్యం.
విజయవాడ సెంట్రల్ సీటు వంగవీటి రాధాకు ఇస్తే.. మరి బోండా ఉమ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో బోండా ఉమా కేవలం 28 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ నుంచి మల్లాది విష్ణు 28 ఓట్లతో గెలిచారు. చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిన బోండా ఉమను ఎక్కడ పోటీ చేయిస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. లేదంటే ఎమ్మెల్సీ ఆఫర్ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే బోండా ఉమనే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కానీ టీడీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దాని పైనే బోండా ఉమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

విజయవాడ పశ్చిమం నుంచి జనసేన అభ్యర్థి పోతిన మహేష్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే తాను పోటీ చేస్తున్నానంటూ బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. నాగుల్ మీరా కూడ టీడీపీ నుంచి ఆశావహుల జాబితాలో ఉన్నారు. అయితే.. ఈ సీటు కోసం జనసేన గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంటుంది. పొత్తులో భాగంగా జనసేనకు విజయవాడ పశ్చిమం వెళ్తే టీడీపీ నేతల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశం. పార్టీ నిర్ణయం శిరసావహిస్తారా .. లేదా ధిక్కరిస్తారా ? అన్న చర్చ మొదలైంది.