Apple Watch: ప్రపంచంలోనే హైఎండ్ టెక్నాలజీతో నడిచే ఫోన్లు, వాచ్ లు ఏ కంపెనీవి అంటే చిటుక్కున ‘యాపిల్’ అని సమాధానం చెబుతారు. ఎందుకంటే ఈ అమెరికన్ తయారీ కంపెనీ ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. ఆపదలో ఉన్న వారిని ఈ ఉపకరణాలు ఆయువు పోశాయి. వారికి రక్షణ కల్పించాయి. ఇక ఆరోగ్య సమస్యలను సూచిస్తూ అందరికీ ప్రాణం పోస్తున్నాయి. అప్పట్లో హార్ట్ బీట్ తక్కువగా ఉన్న ఒక మనిషిని ముందస్తుగా హెచ్చరించిన యాపిల్ వాచ్ అతడి ప్రాణాలను కాపాడింది. తాజాగా కొత్త యాపిల్ వాచ్ లో రీడింగ్ వల్ల ఒక యువతి తాను గర్భవతిని అన్న షాకింగ్ నిజం తెలుసుకుంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ కోకు చెందిన 34 ఏళ్ల యువతి యాపిల్ వాచ్ పెట్టుకొని వాడడం మొదలుపెట్టింది. అలా చేస్తుంటే ఒకరోజు ఆమెకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. నిద్ర పోతున్న సమయంలో కూడా హార్ట్ రేట్ ఎక్కువగా అవుతోందని ఆ నోటిఫికేషన్ లో ఉంది. దీన్ని ఆమె గమనించింది.
గతంలో నిద్రపోయేటప్పుడు హార్ట్ రేట్ 57గా ఉంటే ఇప్పుడు 72కు పెరిగిందని యాపిల్ వాచ్ నోటిఫికేషన్ వచ్చింది. 15 రోజులుగా వరుసగా జరుగుతుంటే అనుమానం వచ్చిన ఆమె వైద్య పరీక్షలు చేసుకుంది. దీంతో తాను ‘గర్భవతి’ని అని తెలిసింది. తనకన్నా ముందే యాపిల్ వాచ్ కు ఈ వార్త తెలిసిందని.. ఇదొక అద్భుతం అంటూ ఆ మహిళ యాపిల్ వాచ్ లను పొగుడుతూ సోషల్ మీడియాలో పేర్కొంది. వాచ్ లేకపోతే అసలు తనకు అనుమానమే వచ్చేది కాదని వివరించింది.

యాపిల్ కంపెనీ విడుదల చేసిన సరికొత్త యాపిల్ వాచ్ లు, ఫోన్లు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. యూజర్ల ఆరోగ్యంపై యాపిల్ కంపెనీ ఫోకస్ పెట్టి తయారు చేసిన ఈ వాచ్ లు హార్ట్ రేట్ మానిటర్, టెంపరేచర్ సెన్సార్ లతో వినియోగదారుల మనసు దోచేస్తోంది. వారి ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతో దోహదపడుతున్నాయి.