Godfather Title Story: ప్రేక్షకుడిని ఆకర్షించే అంశాల్లో టైటిల్ చాలా ప్రధానమైంది. ఒక పవర్ ఫుల్, అట్రాక్టివ్ టైటిల్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఆడియన్స్ ని థియేటర్ వైపు నడిపిస్తుంది. కొన్ని టైటిల్స్ చూస్తే ఆడియన్స్ థియేటర్స్ పక్కకు కూడా వెళ్ళరు. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా సినిమాకు మంచి టైటిల్ చాలా హెల్ప్ చేస్తుంది. చిరంజీవి లేటెస్ట్ రిలీజ్ గాడ్ ఫాదర్ చిత్ర విజయంలో టైటిల్ పాత్ర కూడా ఉంది. చిరంజీవి ఇమేజ్, స్టార్ డమ్ కి సరిపోయేలా, అదే సమయంలో మూవీ నేపధ్యాన్ని ప్రతిబింబించేలా టైటిల్ కుదిరింది.

అయితే లూసిఫర్ తెలుగు రీమేక్ టైటిల్ వెనుక పెద్ద కథే నడిచింది. ఈ విషయాన్ని చిరంజీవి తాజాగా బయటపెట్టారు. గాడ్ ఫాదర్ టైటిల్ కి కర్త కర్మ క్రియ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఆయన సూచనతోనే ఈ టైటిల్ నిర్ణయించారట. చిరంజీవి మాట్లాడుతూ… గాడ్ ఫాదర్ చిత్ర వర్కింగ్ టైటిల్ సర్వాంతర్యామి. ఆ టైటిల్ తోనే చిత్రీకరణ జరిగింది. ఒకరోజు థమన్ గాడ్ ఫాదర్ టైటిల్ సూచించారు. మీ ఇమేజ్ కి కథకు బాగా సెట్ అవుతుంది అన్నాడు. అలాగే లెటర్ ‘జి’ మీకు బాగా కలిసొచ్చింది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి.
కాబట్టి గాడ్ ఫాదర్ అని పెడదాం అన్నారట. టైటిల్ బాగుండటంతో దర్శకుడు, చిరంజీవి ఓకే చేశారట. అయితే లీగల్ సమస్యలు వచ్చాయట. హాలీవుడ్ కి చెందిన గాడ్ ఫాదర్ మూవీ నిర్మాతలు అభ్యంతరం తెలిపారు. వారి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. సినిమా విడుదలకు వారం రోజుల ముందు మాత్రమే ఎన్ఓసీ సర్టిఫికెట్ వచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు. అలా సర్వాంతర్యామి టైటిల్ కాస్తా గాడ్ ఫాదర్ అయ్యింది . థమన్ ఇచ్చిన సలహా సినిమాకు ప్లస్ అయ్యింది.

ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో మంచి ఆదరణ దక్కుతుంది. గాడ్ ఫాదర్ చిత్ర నిర్మాత ఎన్ వి ప్రసాద్ ఊహించిన దానికంటే మంచి వసూళ్లు గాడ్ ఫాదర్ రాబట్టినట్లు ప్రకటించారు. గాడ్ ఫాదర్ ప్రాఫిటబుల్ వెంచర్ గా అభివర్ణించారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో సత్యదేవ్, నయనతార కీలక రోల్స్ చేశారు. అక్టోబర్ 5న వరల్డ్ వైడ్ విడుదలైంది. థమన్ సంగీతం అందించారు.