Chhattisgarh: ప్రేమికుల మధ్య అలకలు,అరమరికలు అన్నవి సహజం. ఒకరిపై ఒకరు కోపాన్ని ప్రదర్శించుకోవడం.. భావోద్వేగాలను వ్యక్తం చేసుకోవడం కాస్త విభిన్నంగా ఉంటాయి. కానీ ఈ ప్రేమ జంట పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధం. ప్రేమికుడి పై అలక బూనిన ఆమె 80 అడుగుల హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కింది. ఆమెను బుజ్జగిస్తూ ప్రేమికుడు సైతం టవర్ ఎక్కాడు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో ప్రేమికుడు కూడా ఆమెతో ఉండిపోయాడు. వారిని టవర్ నుంచి దించేందుకు గ్రామస్తులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొన్ని గంటలపాటు కష్టపడితే గానీ వారు దిగలేదు. చత్తీస్గడ్ రాష్ట్రం గరేలా పెండ్ర మార్వాహి జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది.
గ్రామంలోఓ ప్రేమ జంట ఉంది.ఇటీవలప్రేమికుల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ప్రియుడితో వాదనకు దిగిన యువతి కోపంతో అక్కడే ఉన్న 80 అడుగుల ఎత్తున ఉన్న విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కింది. ప్రేమికుడు ఎంత వేడుకున్నా ఆమె కిందకు దిగి రాలేదు. దీంతో ప్రేమకుడు కూడా టవర్ ఎక్కాడు. ఎంత సేపటికి వారు దిగి పాకపోవడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కిందకు దిగాలని ప్రేమికులను వేడుకున్నారు. కానీ వారు వినలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు
పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రేమికులకు సావధానంగా చెప్పారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే వారు వినలేదు. టవర్ పై ఉన్న జంటతో సుదీర్ఘంగా చర్చలు జరిపాల్సొచ్చింది. కొన్ని గంటల పాటు తర్జనభర్జన తర్వాత టవర్ నుంచి కిందకు దిగేందుకు వారు ఒప్పుకున్నారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ప్రేమికుల ఇద్దరినీ కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.