https://oktelugu.com/

Journalist Life: అశోక్ దే కాదు.. సగటు జర్నలిస్టు బతుకులు ఇవీ

కోవిడ్ సమయంలో చాలావరకు యాజమాన్యాలు ఉద్యోగులను అడ్డగోలుగా తొలగించాయి. కొన్ని సంస్థలు అయితే సగం వేతనాలు మాత్రమే ఇచ్చాయి.. వృత్తిలో భాగంగా క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు కొవిడ్ బారినపడి చాలామంది పాత్రికేయులు కన్నుమూశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 3, 2024 / 11:05 AM IST

    Journalist Life

    Follow us on

    Journalist Life: చేతి పై ఉన్న రాత మన గమనాన్ని నిర్దేశిస్తుంది. ఒక పాత్రికేయుడు రాసే రాత సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే పాత్రికేయులు అంటే సమాజం గౌరవిస్తుంది. 100 తుపాకుల కంటే ఒక్క కలం నన్ను భయపెట్టిందని అంతటి హిట్లర్ అన్నాడంటే పాత్రికేయ వృత్తికి ఏ స్థాయి విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే నానాటికి తీసి కట్టు నామం బొట్టు అనే సామెత తీరుగా పాత్రికేయం మారిపోయింది. న్యూట్రల్ గా ఉండాల్సిన పత్రికలు, చానల్స్ ఏదో ఒక పార్టీకి డప్పు కొట్టడం మొదలైంది. ఫలితంగా పాత్రికేయుడు కనిపిస్తే మీరు ఏ పార్టీ అని అడిగే స్థాయికి పరిస్థితి దిగజారింది. పోనీ అలా చేసినా పాత్రికేయుల జీవితాలు బాగున్నాయా అంటే.. లేదు అనే సమాధానమే వస్తోంది.

    అధిక పని ఒత్తిళ్లు, సమయం లేకుండా పని చేయాల్సి రావడం, అంత పని చేసినప్పటికీ సరైన స్థాయిలో వేతనం రాకపోవడంతో చాలామంది పాత్రికేయులు ఇబ్బంది పడుతున్నారు. అప్పులతో సంసారాలను నెట్టుకొస్తున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేజ్ బోర్డు ఒకటి రెండు మీడియా సంస్థలు మినహా మిగతావి అమలు చేయకపోవడంతో పాత్రికేయులకు అర్ధ జీతాలే వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు అవి కూడా ఇవ్వడం లేదు. పైగా టార్గెట్లు పెట్టి నరకం చూపిస్తున్నాయి. పత్రికలు అయితే ఇయర్లీ యాడ్స్, పేపర్ సర్కులేషన్.. వంటి పనులు అప్పగిస్తున్నాయి. వాస్తవానికి వార్తలు రాయాల్సిన విలేకరులు ఇలాంటి పనులు చేస్తుండడంతో బయట సమాజంలో చులకన అవుతున్నారు. అలాంటి పనులు చేయలేని వారు ఫీల్డ్ కు దూరమవుతున్నారు. ఇక యాజమాన్యాలు రాజకీయ పార్టీలకు డప్పు కొట్టే సంస్థలుగా మారిపోవడంతో పాత్రికేయుల పరిస్థితి మరింత దిగజారుతోంది.

    కోవిడ్ సమయంలో చాలావరకు యాజమాన్యాలు ఉద్యోగులను అడ్డగోలుగా తొలగించాయి. కొన్ని సంస్థలు అయితే సగం వేతనాలు మాత్రమే ఇచ్చాయి.. వృత్తిలో భాగంగా క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు కొవిడ్ బారినపడి చాలామంది పాత్రికేయులు కన్నుమూశారు. కానీ వారికి అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యాలు పైసా ఇచ్చిన పాపాన పోలేదు.. వాస్తవానికి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పాత్రికేయులకు ఈ యాజమాన్యాలు అండగా నిలవాలి. కానీ అలా చేయకుండా మా బాధ్యత కాదంటూ తప్పుకున్నాయి. ఫలితంగా వారినే నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందుకే ఇప్పటి తరంలో చాలామంది పాత్రికేయానికి దూరంగా ఉంటోంది అందుకే.. సరైన వేతనాలు రాక.. జీవితంలో ఎదుగుదల లేక ఇబ్బంది పడే కంటే.. ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడటం ఉత్తమం అనే మార్గానికి నేటి యువత వచ్చింది. ఇక పాత్రికేయ జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయో, ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో, జీతం సరిగ్గా లేకుంటే పడే వేదన ఎలా ఉంటుందో.. ఓ పాత్రికేయుడు సోషల్ మీడియా వేదికగా పెట్టిన వీడియో పోస్ట్ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది.