
Uttar Pradesh: పాము పేరు వినగానే వణుకు పుడుతుంది. ఇక అది కాటేస్తే ప్రాణాలు ఉంటాయో పోతాయో కూడా తెలియక భయం మొదలౌతుంది. పాము కాటేయగానే సాధారణంగా అందరం పామును చంపి, బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్తాం.. కానీ ఓ భర్త తన భార్యను పాము కాటేస్తే.. ఆమెను ఆస్పత్రికి తరలించడంతోపాటు పామును కూడా ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా ఉమన్ అత్వా గ్రామంలో నరేంద్ర అతడి భార్య కుష్మా నివాసం ఉంటున్నారు. కుష్మా తన ఇంటిని శుభ్రం చేస్తుండగా.. ఓ పాము కాటేసింది. గట్టిగా కేకలు వేస్తూ కాసేపటికే అపస్మారక స్థితిలోకి జారుకుంది. అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. భార్యకు పాము కాటేసిందన్న విషయం తెలుసుకున్న నరేంద్ర.. నేరుగా ఇంటికెళ్లాడు. భార్యను కాటేసిన పామును పట్టుకుని దానిని సంచిలో వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పామును చూసి ఆసుపత్రి సిబ్బంది ఎందుకు తీసుకొచ్చావ్ అని నిలదీశారు. తన భార్యను ఏ పాము కాటేసిందో చూపిస్తే దానికి తగ్గట్టుగానే వైద్యం అందించడానికి వీలు పడుతుందని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. కుష్మా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. పామును అడవిలో వదిలేయాలని సూచించారు.

అతనిని కాటేసి ఉంటే..
అయితే చిన్న పామును అయినా పెద్ద కర్రతో కొట్టాలి అన్న సామెతలా నరేంద్ర తన భార్యను కరిచిన పాము చిన్నదో పెద్దతో తెలుసుకోవడంతోపాటు దాని విష ప్రభావం ఎంతుంటుందో వైద్యులకు తెలియాలని భావించినట్లు ఉన్నాడు. అందుకే ఆయన భార్య ఆస్పత్రిలో ఉన్నా.. ఇంటికి వచ్చి పామును వెతికిమరీ పట్టుకున్నాడు. ఇందుకు స్థానికులు ఆయనకు సహకరించారు. తర్వాత ఆ పామును సంచిలో వేసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే పామును పట్టుకునే క్రమంలో ఆయనను కరిచి ఉంటే పరిస్థితి ఏంటని స్తానికులు పేర్కొంటున్నారు. పాములతో పరాచికం ఆడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటనపై నిటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.