Nellore: సాధారణంగా కొన్ని ఘటనలు విచిత్రంగా జరుగుతాయి. అయితే వాటి పరిణామాలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. అయితే జీవితమన్నాక భయపెట్టిన ఘటనలు, ఆశ్చర్యకర పరిణామాలు సహజం. అయితే చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తే మాత్రం అది షాకే కదా. ప్రమాదంలో మృతిచెంది.. అంత్యక్రియలు పూర్తిచేసిన వ్యక్తి అలా రోడ్డుపైవస్తే చూసేవారికి మైండ్ బ్లాకే కదా. నెల్లూరు జిల్లాలో తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. చనిపోయిన వ్యక్తికి కుటుంబసభ్యులు, గ్రామస్థులు అంత్యక్రియలు చేశారు. తీరా అక్కడికి ఒక రోజుపోయే సరికి చనిపోయిన వ్యక్తి నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. తొలుత షాక్ కు గురైన గ్రామస్థులు తరువాత అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు మాత్రం ఆయన తిరిగొచ్చినందుకు సంతోషపడ్డారు.

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో వింత ఘటన వెలుగుచూసింది. సర్పంచ్ రమాదేవి రెండో కుమారుడు సతీష్ నాలుగు రోజుల కిందట ఇంటి నుంచి తప్పిపోయాడు. మానసిక రుగ్మతతో బాధపడే సతీష్ బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలో వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలోని చెరువులో గుర్తుతెలియని మృతదేహం ఒకటి కనిపించింది. అది సతీష్ గా భావించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. దీంతో హుటాహుటిన అక్కడ చేరుకున్న కుటుంబసభ్యులు మృతదేహం సతీష్ ది గా నిర్థారించారు. గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. సీన్ కట్ చేస్తే.. ఆ మరుసటి రోజే సతీష్ రోడ్డుపై నడుచుకుంటూ వచ్చాడు. ఇదెంటి .. చనిపోయినవ్యక్తి నడిచి రావడం ఏమిటని గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కానీ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. నేరుగా సతీష్ ఇంటికి వెళ్లేసరికి కుటుంబసభ్యులదీ అదే పరిస్థితి. కొంత సమయానికి సర్దుకొని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది.

అయితే చెరువులో చనిపోయినది ఎవరు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరైన హత్యచేసి చెరువులో పడేశారా? లేకుంటే స్థానికులెవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. మానసిక రుగ్మతతో బాధపడే సతీష్ నాలుగు రోజులు కనిపించకపోయేసరికి కంగారు చెరువులో పడిన మృతదేహం అతడిదిగా భావించారు. అందుకే కేసు మిస్టరీగా మారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. దహనం చేసిన మృతదేహం ఆనవాళ్లు నుంచి శాంపిల్ సేకరించే పనిలోపోలీసులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో చనిపోయాడునుకున్న కుమారుడు ఇంటికి రావడంతో తల్లిదండ్రులు సంతోషపడుతుండగా..కేసు మిస్టరీగా మారడంపై పోలీసులు భారంగా పరిగణిస్తున్నారు.