https://oktelugu.com/

Hyderabad: సైబర్‌ వలలో టెకీ.. రూ.2వేలు కట్టి.. రూ.31 లక్షలు పోగొట్టుకున్నాడు!

పార్ట్‌ టైం జాబ్‌ పేరిట టాస్కులు చేస్తే డబ్బులు ఇస్తామని ఓ సైబర్‌ నేరగాడు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను బురిడీ కొట్టించాడు. వెయ్యో... రెండు వేలో కాదు.. ఏకంగా రూ.31 లక్షలు కొట్టేశాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 15, 2024 12:03 pm
    Hyderabad

    Hyderabad

    Follow us on

    Hyderabad: మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం.. మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. కొత్తగా పుట్టుకొస్తారు. ఆశా జీవి అయిన మనిషిని బురిడీ కొట్టించడం చాలా ఈజీ. ఈ ఫార్ములానే ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లకు కలిసి వస్తోంది. దేశంలో సైబర్‌ నేరాల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. సైబర్‌ నేరగాళ్లు కూడా అంతే వేగంగా రూటు మారుస్తున్నారు. రోజుకో కొత్తరకం మోసాలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. చదువు రానివారు, టెన్నాలజీ గురించి తెలియని వారే కాదు.. పెద్ద చదువులు చదివి, టెక్నాలజీపై పట్టు ఉన్నవారు కూడా సైబర్‌ మోసాలబారిన పడుతున్నారు. తాజాగా ఓ టెకీ సైబర్‌ వలలో చిక్కి ఏకంగా రూ.31 లక్షలు పోగోట్టుకున్నాడు.

    పార్ట్‌టైం జాబ్‌ పేరిట..
    పార్ట్‌ టైం జాబ్‌ పేరిట టాస్కులు చేస్తే డబ్బులు ఇస్తామని ఓ సైబర్‌ నేరగాడు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను బురిడీ కొట్టించాడు. వెయ్యో… రెండు వేలో కాదు.. ఏకంగా రూ.31 లక్షలు కొట్టేశాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అన్నీ తెలిసిన టెకీ కూడా సైబర్‌ బారిన పడి మోసపోయాక ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. అమీ¯Œ పూర్‌ పురపాలక పట్టణ పరిధి నవ్యనగర్‌ కాలనీలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉంటున్నాడు. ఆయన ఫోన్‌కు ఫిబ్రవరి 26న ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం జాబ్స్‌ అంటూ ఒక లింగ్‌ వచ్చింది. దానిని అతడు క్లిక్‌ చేశాడు. లింకులో పేర్కొన్నట్లుగా టాస్కులు ఇచ్చాడు. టాస్కులుపూర్తి చేయాలంటే ముందుగా రూ.2 వేలు కట్టాలని చెప్పడంతో టెకీ అవి కూడా కట్టాడు. తర్వాత టాస్కులు పూర్తి చేయడంతో కమీషన్‌ ఇచ్చాడు. తర్వాత మళ్లీ డబ్బులు కట్టమన్నాడు. ఇలా టెకీ తన ఖాతా నుంచి రూ.31 లక్షలు కేటుగాడి అకౌంట్‌కు పంపించారు. తర్వాత స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    అవగాహన కల్పిస్తున్నా..
    బ్యాంకులు, జాబ్స్‌ పోరుతో వచ్చే మెస్సేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అయినా చాలా మంది అత్యాశకుపోయి ఇలా సైబర్‌ మోసాలబారిన పడుతున్నారు. ఇక ఇక్కడ అన్నీ తెలిసిన టెకీ కూడా సైబర్‌ మోసానికి గురవడం గమనార్హం. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదువుకున్నవారు కూడా మోసాలబారిన పడడం ఆందోళన కలిగిస్తోందని పోలీసులు అంటున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.