CAA: భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం కల్పిండమే లక్ష్యంగా తీసుకువచ్చిన సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) అమలు చేయాలని కేంద్రం నిర్వహించింది. 2019లోనే ఈ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. కానీ, ఇన్నాళ్లూ అమలు చేయని కేంద్రం 2024 సార్వత్రిక ఎన్నికల వేళ సీఏఏ అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనిపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.
సీఏఏపై కీలక వ్యాఖ్యలు..
భారత్ అమలులోకి తెచ్చిన సీఏఏపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. సీఏఏ అమలు తమను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంది. దీనిని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ‘‘మార్చి 11న వచ్చిన సీఏఏ నోటిఫికేషన్‌పై మేం ఆందోళన చెందుతున్నాం. దీన్ని ఎలా అమలు చేయబోతున్నారు అని నిశితంగా గమనిస్తున్నాం. మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్నివర్గాల వారిని సమానంగా చూడడం ప్రజాస్వామ్య మూల సూత్రం’’ మిల్లర్ పేర్కొన్నారు.
సీఏఏ ఎవరి కోసం..
భారత్ తీసుకువచ్చిన సీఏఏ పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వం ఇచ్చేందుకు వీలుగా కేంద్రం సీఏఏ–2019 తీసుకువచ్చింది. దీనిని 2019లో భారత పార్లమెంటు ఆమోదం తెలిపింది. అదే ఏడాది రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. కానీ, విపక్షా ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా దీనిని వెంటనే అమలు చేయకుండా కేంద్రం హోల్డ్‌లో పెట్టింది. తాజాగా పార్లమెంటు ఎన్నికల సమయంలో కేంద్రం దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అమెరికాకు సంబంధించిన అంశం కాకపోయినా అగ్రరాజ్యం సీఏఏపై ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముందు ముందు అమెరికా ఎలా స్పందిస్తుంది అన్న చర్చ జరుగుతోంది.