Rajasthan Bakrid Festival 2023: వ్యవసాయ ఆధారిత దేశం మనది. రైతులు పంటలు సాగుచేస్తూనే.. అనుబంధంగా పశువులు, కోళ్లు పెంపకం చేస్తుంటారు. రైతుల ఇళ్లలో చాలా వరకు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు కనిపిస్తుంటాయి. కోళ్లు, మేకలు, గొర్రెలను పెంచి విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. అరుదైన, మేలుజాతి పశువులు, పక్షులను పెంచడం ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా ఓ రైతు పెంచిన ఓ గొర్రె మాత్రం ఏకంగా కోటి రూపాయలు పలుకుతూ ఆశ్చర్యపరుస్తుంది. అయినా సదరు రైతు విక్రయించేందుకు ఇష్టపడడం లేదు.
రాజస్థాన్ రైతు వద్ద విలువైన గొర్రె..
రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన రైతు రాజుసింగ్ వద్ద ఈ విలువైన గొర్రె ఉంది. గొర్రెల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్న రాజుసింగ్ తన గొర్రెల మందంలోని ఓ గొర్రెకు కోటి రూపాయలు ఇస్తామని చాలామంది అడుగుతున్నారు. అయితే అమ్మేందుకు రాజుసింగ్ ఇష్టపడడం లేదు.
786 దాని ప్రత్యేకం..
ఆ గొర్రెకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఈ గొర్రె పొట్ట భాగంలో ఉర్దూ భాషలో 786 ఆకారం ఉంది. గత ఏడాది పుట్టిన ఈ గొర్రెపిల్ల.. పెరుగుతున్న క్రమంలో ఉర్దూ భాషలో ఏదో ఆకారం రావడాన్ని గమనించాడు. అయితే తొలుత ఏంటో అర్థం కాలేదు. చివరికీ తన గ్రామంలో ఉన్న ముస్లింలకు చూపించగా.. అది ఉర్దూ భాషలో 786 సంఖ్య అని చెప్పారట. ముస్లింలకు ఆ నంబర్ దేవుడి సంఖ్యగా భావిస్తారు. ఈ విషయం తెలిసి కొనేందుకు రాజు దగ్గరకు వస్తున్నారు.
దేవుడి ఆశీస్సులు ఉన్నాయి..
అయితే ఈ గొర్రె ద్వారా దేవుడి ఆశీస్సులు తనకు కూడా ఉన్నాయని, దానిని అమ్మితే ఆశీస్సులు పోతాయని రాజుసింగ్ అంటున్నారు. అందుకే కోటి రూపాయలు ఇచ్చినా గొర్రె అమ్మడం లేదు. అంతేకాదు. సదరు గొర్రెపిల్లను మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్..
ఉర్దూలో 786 అని ఉన్న ఈ గొర్రెకు సంబంధించిన ఫొటోలు, యజమాని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మరింతమంది రాజుసింగ్ అడ్రస్ కోసం ఆరా తీస్తున్నారు. తాము కొంటామని, ధర ఎంతో చెప్పాలని కామెంట్ పెడుతున్నారు. చూస్తుంటే మళ్లీ బక్రీద్ నాటికి ఈ గొర్రె విలువ రూ.2 కోట్లకు చేరుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.