Homeట్రెండింగ్ న్యూస్Madhya Pradesh: వివాహ పథకం.. వివాదాస్పదం.. పెళ్లికి ముందే గర్భ నిర్ధారణ పరీక్షలతో దుమారం!

Madhya Pradesh: వివాహ పథకం.. వివాదాస్పదం.. పెళ్లికి ముందే గర్భ నిర్ధారణ పరీక్షలతో దుమారం!

Madhya Pradesh
Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో సామూహిక వివాహ పథకం వివాదాస్పదమవుతోంది. పెళ్లికి ముందు పెళ్లి కూతుళ్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం దూమారం రేపుతోంది. లబ్ధిదారుల జాబితాలో కొంతమంది మహిళల పేర్లు లేకపోవడం, గర్భ నిర్ధారణ పరీక్షల్లో వారికి పాజిటివ్‌ రావడంతో వివాదం చెలరేగింది. వివాహ పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళల అర్హతను తనిఖీ చేసేందుకు వారికి గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడంపై అధికార బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సామూహిక వివాహానికి ఏర్పాట్లు..
మధ్య ప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని గడసరాయ్‌ పట్టణంలో జిల్లా యంత్రాంగం ఏప్రిల్‌ 22న ముఖ్యమంత్రి కన్యాదన్‌ యోజన కింద 219 జంటలకు వివాహం చేసింది. అయితే ఈ సామూహిక కళ్యాణోత్సవంలో పెళ్లికి వచ్చిన కొందరు మహిళల పేర్లు జాబితాలో కనిపించలేదు. వారి ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు పాజిటివ్‌గా తేలడంతో వారి పేర్లను ప్రస్తావించలేదు.

కన్యాదాన్‌ పథకం కింద ఆర్థికసాయం..
పేదింటి ఆడపిళ్లకు పెళ్లి చేయాలనే సంకల్పంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి కన్యాదాన్‌ యోజన ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జంటకు రూ.55 వేల చొప్పున మంజూరు చేస్తుంది. రూ.55 వేల గ్రాంట్‌లో రూ.49,000 పథకానికి అర్హులైన మహిళలకు అందజేస్తుంది. రూ.6 వేలు సామూహిక వివాహాల ఏర్పాటుకు ఖర్చు చేస్తారు. బచ్చర్‌గావ్‌ నివాసి అయిన ఒక మహిళ, తాను ముఖ్యమంత్రి కన్యాదన్‌ యోజన కింద వివాహం చేసుకోవడానికి ఫారమ్‌ను నింపినట్లు చెప్పింది. ఫారమ్‌ను పూరించిన తర్వాత, బజాగ్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఆమెకు వైద్య పరీక్ష జరిగింది. వైద్య పరీక్షల సమయంలో గర్భ నిర్ధారణ పరీక్ష కూడా జరిగింది. ఇందులో పాజిటివ్‌ రావడంతో ఆమె పేరును తొలగించారు.

వైద్య పరీక్షల గురించి చెప్పలేదని..
బచ్చర్‌గావ్‌కు చెందిన మరో మహిళ తనకు వైద్య పరీక్ష గురించి ఏమీ చెప్పలేదని ఆరోపించారు. జాబితాలో ఆమె పేరు ప్రస్తావించలేదు. పూర్తి సన్నాహాలతో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నానని, అయితే పెళ్లి చేసుకోలేకపోయానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. గర్భ నిర్ధారణ పరీక్ష మహిళలను అవమానించడమే అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ క్యాబినెట్‌ మంత్రి ఓంకార్‌ మార్కమ్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి కన్యాదాన్‌ యోజన కింద గర్భ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏదైనా నిబంధనలు రూపొందించి ఉంటే దానిని బహిరంగపరచాలని డిమాండ్‌ చేశారు.

Madhya Pradesh
Madhya Pradesh

అనర్హులను తొలగించేందుకే..
గతంలో సామూహిక వివాహాలు నిర్వహించిన సమయంలోనూ కొంతమంది పెళ్లయినవారు డబ్బుల కోసం తమకు పెళ్లి కాలేదని మరోమారు పెళ్లి చేసుకున్నారు. అనర్హుల చేరికతో అర్హులకు అన్యాయం జరుగుతోంది. అర్హులకు అన్యాయం జరుగకూడాదనే ఉద్దేశంతోనే వైద్య పరీక్షలు చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చేసిన పరీక్షల్లోనూ కొంత మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు.

మొత్తానికి పెళ్లికి ముందు.. మహిళలకు గర్భనిర్ధారణ పరీక్షలు చేయడం వివాదాస్పదమవుతోంది. అర్హులను నిర్ధారించేందుకు ఇతర పద్ధతులు అవలంబిచాలి కానీ, ఇలా గర్భనిర్ధారణ చేయడం ఏమిటని మహిళా సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version