https://oktelugu.com/

Portugal: జనాన్ని ముంచెత్తిన ‘రెడ్‌ వైన్‌’ వరద.. ఎలా వచ్చింది? ఏంటి కథ అంటే..!

రెడ్‌వైన్‌ వరదలతో అక్కడి అధికారులు పర్యావరణ హెచ్చరిక జారీ చేశారు. ఈ వరద ప్రభావం పట్టణంలోని 2 వేల మంది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 12, 2023 / 12:35 PM IST

    Portugal

    Follow us on

    Portugal: వరద అనగానే భారీ వర్షాలు, చెరువులు, డ్యాంల గేట్లు ఎత్తడం.. లేదా కరకట్టలు తెగిపోవడం ద్వారా వస్తుంది అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన వరద వర్షాలతో కాదు.. అది వైన్‌ వరద. ఆదివారం నాడు 2.2 మిలియన్‌ లీటర్ల రెడ్‌వైన్‌ తమ వీధుల్లోకి రావడంతో పోర్చుగల్‌లోని లెవిరా పౌరులు షాక్‌కు గురయ్యారు.

    ఎక్కడి నుంచి వచ్చింది..
    ఈ రెడ్‌ వైన్‌ వరద డిస్టిలరీ నుంచి వచ్చింది. అనాడియా ప్రాంతంలో ఉన్న డిస్టిలరీలో రెండు భారీ ట్యాంకులు.. ఒకోక్కటి 6 లక్షల లీటర్ల సామర్థ్యంలో ఉన్నవాటిలో ఈ రెడ్‌వైన్‌ నిల్వ ఉంచారు. అకస్మాత్తుగా ఈ రెండు ట్యాంకులు బ్లాస్ట్‌ అయ్యాయి. దీంతో అందులోని వైన్‌ మొత్తం లెవిరా వీధులను ముంచెత్తింది. సావో లోరెంజో డి బెరో పట్టణాన్ని రెడ్‌ వైన్‌తో కప్పేసింది.

    పర్యావరణ హెచ్చరిక..
    రెడ్‌వైన్‌ వరదలతో అక్కడి అధికారులు పర్యావరణ హెచ్చరిక జారీ చేశారు. ఈ వరద ప్రభావం పట్టణంలోని 2 వేల మంది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. అదే విధంగా ఈ రెడ్‌వైన్‌ మొత్తం సమీపంలోని సెర్టిమా నదిలో కలిసింది. దీంతో నది పూర్తిగా కలుషితం అవుతుందని అధికారులు ఆందోళన చెందారు. తద్వారా ఈ నీటిని సరఫరా చేసే ప్రాంతాలపైనా ప్రభావం చూపుతుందని నిర్ధారించారు.

    కాలుష్య నివారణకు చర్యలు..
    వెంటనే డిస్టిలరీ యాజమాన్యం అనాడియా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ను సంఘటన స్థలానికి పిలిచారు. వారి సహాయంతో వరదను నది నుంచి దూరంగా, సమీపంలోని పొలంలోకి మళ్లించారు. అక్కడ భారీ గుంతను తవ్వించి అందులోకి పంపించారు.

    ట్యాంకుల బ్లాస్టింగ్‌పై విచారణ..
    అయితే డిస్టిలరీ ట్యాంకులు పేలడానికి కారణాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే రెడ్‌ వైన్‌ వరద కారణంగా ఇప్పటి వరకు ఎవరికీ నష్టం జరుగలేదని డిస్టిలరీ యాజమాన్యం గుర్తించింది. డిస్టిలరీకి సమీపంలో నివసిస్తున్న ఒక వ్యక్తి సెల్లార్‌ ద్రాక్ష రసంతో నిండిపోయిందని తెలిపింది.
    అయితే స్పందించిన యాజమాన్యం నష్టానికి సబంధించిన ఖర్చును తామే భరిస్తామని, శుభ్రం చేయిస్తామని తెలిపింది. ఈమేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. వెంటనే అలా చేయడానికి బందాలు ఉన్నాయి‘ అని లెవిరా డిస్టిలరీ ఒక ప్రకటనలో తెలిపారు, వారు ‘ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నారు‘ అని తెలిపారు.