ATM Fraud: ఏటీఎంలో కొత్త తరహా దొంగతనం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన పోలీసులు

బ్యాంకులు మనకు ఇచ్చిన డెబిట్ కార్డులతో ఏటీఎం కేంద్రాలకు వెళ్లి కార్డ్ స్వైప్ చేసి డబ్బులు డ్రా చేసుకుంటాం. అదే ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ ఏటీఎంలో మాత్రం డెబిట్ కార్డ్ స్వైప్ చేసి పిన్ నెంబర్ నమోదు చేస్తే డబ్బులు రావడం లేదు.

Written By: Suresh, Updated On : February 16, 2024 6:56 pm

ATM Fraud

Follow us on

ATM Fraud: శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలు. అయితే ఇలాంటి ఉపాయాలు మంచి కోసమైతే బాగానే ఉంటుంది. అదే చెడు కోసమైతే ఎప్పుడో ఒకసారి బయట పడుతూనే ఉంటుంది. అలాంటి చెడు పనులకు పాల్పడి కటకటాల పాలయ్యారు ఓ ముగ్గురు వ్యక్తులు. చేసిన తప్పుకు చింతిస్తూ జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. ఇంతకీ వారు చేసిన నయా దోపిడీ ఏంటో మీరే చదివేయండి.

బ్యాంకులు మనకు ఇచ్చిన డెబిట్ కార్డులతో ఏటీఎం కేంద్రాలకు వెళ్లి కార్డ్ స్వైప్ చేసి డబ్బులు డ్రా చేసుకుంటాం. అదే ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ ఏటీఎంలో మాత్రం డెబిట్ కార్డ్ స్వైప్ చేసి పిన్ నెంబర్ నమోదు చేస్తే డబ్బులు రావడం లేదు. పైగా ఖాతాలో నుంచి డబ్బులు డెబిట్ అయినట్టు మెసేజ్ వస్తోంది.. ఈ అనుభవం ఇటీవల చాలామందికి ఎదురైంది. దీంతో వారంతా బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులు కూడా పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు మూడు రోజులు ఆ ఏటీఎం సెంటర్ వద్ద పహారా కాశారు. అయినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో సీసీ కెమెరాలను నమ్ముకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో అందరూ అవాక్కయ్యారు.

దస్నాపూర్ ఏరియాలో చాలా ఏటీఎంలు ఉన్నప్పటికీ ఒక్క ఏటీఎంలో మాత్రం ఎప్పటికీ డబ్బులు ఉంటాయి. అందులో మాత్రమే డబ్బులు వస్తాయి. మారుమూల ప్రాంతం కావడంతో బ్యాంకు అధికారులు రోజూ అందులో నగదు జమ చేస్తారు.. ఇటీవల కొంతమంది వ్యక్తులు ఏటీఎంలో నగదు బయటికి వచ్చే ప్రదేశంలో ప్లాస్టర్ అంటించారు. ఎవరికి అనుమానం రాకుండా అత్యంత చాకచక్యంగా దాన్ని అంటించారు. గత మంగళవారం సాయంత్రం పట్టణంలోని బ్రాహ్మణ వాడకు చెందిన సతీష్ దేశ్ పాండే అనే వ్యక్తి ఆ ఏటీఎం సెంటర్ కి వెళ్లి 5000 డ్రా చేశాడు. ఎంతసేపటికీ నగదు బయటికి రావడం లేదు. తన ఖాతాలో నగదు డెబిట్ అయినట్టు అతడికి మెసేజ్ వచ్చింది. ఈ తరహా అనుభవం ఇటీవల చాలామందికి ఎదురైన నేపథ్యంలో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగులు ఏటీఎం నుంచి డబ్బులు వచ్చే ప్రాంతంలో ప్లాస్టర్ అంటించినట్లు గుర్తించారు. వినియోగదారులు కార్డు స్వైప్ చేయడం.. డబ్బులు రాకపోవడంతో వెళ్లిపోవడంతో దుండగులు ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి ప్లాస్టర్ తొలగించి నగదు తీసుకెళుతున్నారు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. “నిన్న మొన్నటి వరకు డెబిట్ కార్డు లోని ద్వారా డబ్బులు డ్రా చేసే దుండగులను చూశాం. సైబర్ మోసాల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించే మాయగాళ్ళను చూశాం. కానీ ఏటీఎం సెంటర్లో డబ్బులు బయటకు వచ్చే ప్రదేశంలో ప్లాస్టర్ అంటించి మోసం చేసే వారిని తొలిసారి చూస్తున్నామని” మావల వాసులు అంటున్నారు.