https://oktelugu.com/

Mancherial: ఎంటి దేవుడా ఇదీ.. మరణానంతరం కొలువు పిలుపు.. కబురు తెచ్చిన పోస్ట్‌మెన్‌ కూడా కన్నీరు పెట్టినవైనం..

సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల మందమర్రి పట్టణంలోని ఫస్ట్‌ జోన్‌కు చెందిన సిద్దెంకి మొండయ్య, సరోజ దంపతులకు నవీన్‌కుమార్, అనూష, ఆదిత్య, జీవన్‌కుమార్‌ నలుగురు సంతానం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 22, 2024 / 11:23 AM IST

    Mancherial

    Follow us on

    Mancherial: చదువు పూర్తికాగానే సర్కార్‌ కొలువు సాధిచండమే లక్ష్యంగా ఇప్పటికీ చాలా మంది నిరుద్యోగులు కష్టపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చాలా మంది ప్రిపరేషన్ లో ఉన్నారు. కానీ, పదేళ్ల తెలంగాణ సర్కార్‌ ఆశించిన మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. వాటిలో ఒక పోస్టు తనదే అన్న లక్ష్యంతో ఆ యువకుడు కష్టపడ్డాడు. రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. దీంతో మనో వేదనకు గురయ్యాడు. అదే సమయంలో అక్క, తల్లి అనారోగ్యంతో మృతిచెందడం అతడిని మరింత కుంగదీసింది. మూడోసారి సర్కార్‌ కొలువు కోసం ప్రయత్నించాడు. ఫలితం రాకముందే.. తనకు ఇక కొలువు రాదని నాలుగేళ్ల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ, తనొకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. ఆ యువకుడు చనిపోయిన నాలుగేళ్లకు ప్రభుత్వం ఉద్యోగం సాధించావంటూ పిలుపు వచ్చింది. ఉద్యోగంలో చేరాలంటూ ఇంటికి ఉత్తరం వచ్చింది. కానీ, ఆ యువకుడు చనిపోయాడని తెలిసి సమాచారం తెచ్చిన పోస్ట్‌ మ్యాన్‌ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు.

    మంచిర్యాల జిల్లాలో ఘటన..
    సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల మందమర్రి పట్టణంలోని ఫస్ట్‌ జోన్‌కు చెందిన సిద్దెంకి మొండయ్య, సరోజ దంపతులకు నవీన్‌కుమార్, అనూష, ఆదిత్య, జీవన్‌కుమార్‌ నలుగురు సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. జీవన్‌ కుమార్‌(24) 2014లో ఐటీఐ పూర్తి చేశారు. 2018 లో వెలువడిన విద్యుత్‌ శాఖ లైన్‌మెన్‌ పోస్ట్‌కు దరఖాస్తు చేశాడు. పరీక్ష కూడా రాసి ఫలితాల కోసం ఎదురు చూశాడు. అదే సమయంలో అనారోగ్యంతో అక్క ఆదిత్య 2018 లో మృతి చెందింది.. ఆ వెంటనే తల్లి సరోజ సైతం అనారోగ్యంతో 2019 జనవరిలో మరణించింది.

    వరుస విషాదాలతో..
    ఏడాది వ్యవధిలో తల్లి, అక్క మరణం, సర్కారు కొలువు రాలేదన్న బాధ మరోవైపు జీవన్‌కుమార్‌ను కుంగదీసింది. ఈ క్రమంలో మరో ప్రయత్నంగా సింగరేణి ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో అతడు ఇక బతకడం సరికాదనుకున్నాడు. 2020, మార్చి 15న ఉరేసుకుని మరణించాడు. జీవన్‌ ఆత్మహత్య చేసుకున్న ఏడాదికే అతని అక్క అనూష, తండ్రి మొండయ్య సైతం తనువు చాలించారు. ఆరుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఆ ఇంట్లో ప్రస్తుతం పెద్దకొడుకు నవీన్‌ ఒక్కడే మిగిలాడు. 2018 నుంచి 2020 వరకు నలుగురు మరణించారు.

    విషాదం నిండిన ఇంటికి మరో కబురు..
    వరుస మరణాలతో విషాదం నిండిన ఇంటికి రెండు రోజుల క్రితం ఓ కబురు వచ్చింది. అది ఆ ఇంట్లో వారిని మరింత బాధపెట్టింది. జీవన్‌కుమార్‌ను వెతుక్కుంటూ వచ్చిన పోస్టుమెన్‌..మీకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది అంటూ నవీన్‌కుమార్‌కు లెటర్‌ అందించాడు. దానిని చూసిన నవీన్‌.. మా తమ్ముడు చనిపోయి నాలుగేళ్లైందంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. శుభవార్త మోసుకొచ్చానని భావించిన పోస్టుమెన్‌ సైతం విషయం తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు.

    లైన్‌మెన్‌ ఉద్యోగం…
    ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుకు జీవన్‌కుమార్‌ 2018 పరీక్ష రాశాడు. మిగులు పోస్టుల భర్తీపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ నిలిచి పోయింది. ఈ పోస్ట్‌ తప్పక సాధిస్తానని ఆశలు పెంచుకున్న జీవన్‌కుమార్‌.. రెండేళ్లైన సమాచారం రాకపోవడం, ఇంట్లో వరుస మరణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. చివరకు మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం కొత్త ప్రభుత్వం నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో జీవన్‌కుమార్‌కు కొలువు వచ్చిందని కబురు పంపింది. విద్యుత్‌ స్తంభం ఎక్కే పరీక్షకు జూన్‌ 24న హాజరు కావాలని కాల్‌ లెటర్‌ పంపింది.