Coal Block Auction 2024: తెలంగాణలో ‘కోల్‌’ వార్‌.. గనుల వేలంపై పేలుతున్న మాటల తూటాలు!

సింగరేణి గనుల వేలాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిన వేలం వేదికగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు.

Written By: Raj Shekar, Updated On : June 22, 2024 11:17 am

Coal Block Auction 2024

Follow us on

Coal Block Auction 2024: తెలంగాణలో ‘కోల్‌’ వార్‌ కొనసాగుతోంది. తెలంగాణ వేదికగానే దేశంలో బొగ్గు గనుల వేలం చేపట్టింది కేంద్రం. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారకరామరారావు మధ్య తాజాగా ట్వీట్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పీసీసీ అధ్యక్షుడిగా 2021లో బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని, 4 బొగ్గ బ్లాకులను సింగరేణికి బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన నాడు రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. నాడు అడ్డుకుని.. నేడు వేలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పంపించడం ఏంటని నిలదీశారు. ఈ మార్పు దేనికి సంకేతమని ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

పాయిట్‌ టూ పాయిట్‌ రిప్లై..
ఇక కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సంధించిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. పాయింట్‌ టూ పాయింట్‌ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణను, తెలంగాణ ప్రజల వాటాల విక్రయానికి కేంద్రం పూనుకున్నా, గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రయత్నించినా.. కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారని వెల్లడించారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి బొగ్గు గనులను తొలిసారి వేలం వేసిన విషయాన్ని గుర్తు చేశారు. గనులను రెండు ప్రైవేటు కంపెనీలు అరబిందో, అవంతిక కంపెనీలకు కట్టబెట్టిందని తెలిపారు. అప్పుడు మౌనంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని విమర్శించారు.

వేలం వేదికగా వ్యతిరేకించాం..
ఇక సింగరేణి గనుల వేలాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిన వేలం వేదికగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. అవంతిక, అరబిందో సంస్థలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు భట్టి విక్రమార్క రాసిన లేఖను కూడా తన ట్వీట్‌కు జత చేశారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సురక్షితం ఉంటుందని తెలిపారు. మన బొగ్గు.. మన హక్కును కాపాడి తీరుతాం అంటూ ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌కు సమాధానం ఇచ్చారు సీఎం రేవంత్‌.