West Indies Vs USA: టి20 వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లలో అద్భుతమైన విజయాలు సాధించిన అమెరికా.. సూపర్ -8 కు దర్జాగా వెళ్ళింది. కానీ, అదే మ్యాజిక్ సూపర్ -8 లో ప్రదర్శించలేకపోతోంది. జూన్ 19న అంటిగ్వా వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైన అమెరికా.. శనివారం వెస్టిండీస్ తో తలపడి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు మైదానంలో విధ్వంసాన్ని సృష్టించారు. ఇంగ్లాండ్ జట్టుతో ఎదురైన పరాభవాన్ని.. ఈ విజయంతో భర్తీ చేశారు.
ముందుగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన అమెరికా 19.5 ఓవర్లలో 128 పరుగులు చేసింది. గౌస్ 16 బంతుల్లో 29 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో చేజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. రసెల్ కూడా మూడు వికెట్లు దక్కించుకొని సత్తా చాటాడు. జోసెఫ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు అమెరికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే అమెరికాకు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ స్టీవెన్ టేలర్ రెండు పరుగులు మాత్రమే చేసి రసెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గౌస్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే లో అమెరికా 48 రన్స్ చేసింది. అయితే ఈ జోరును చివరి వరకు కొనసాగించలేకపోయింది. వెస్టిండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో అది అమెరికా స్కోర్ మీద ప్రభావం చూపించింది. చేజ్ దూకుడుగా బౌలింగ్ చేయడంతో 51/1వద్ద ఉన్న అమెరికా.. 65 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయింది. మిలింద్ కుమార్ 19, షాడ్లీ 18 పరుగులు చేసి అమెరికాను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ.. వెస్టిండీస్ బౌలర్ల వాళ్ల పప్పులు ఉడకలేదు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి, 10.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. హోప్ 82*, పూరన్ 27 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.
హోప్ ప్రారంభంలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని చూపించాడు. ప్రతి ఓవర్ కు కనీసం రెండు బౌండరీలు కొట్టాడు. మరో ఓపెనర్ చార్లెస్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. హర్మీత్ సింగ్ అద్భుతమైన బంతికి చార్లెస్ పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హోప్ దూకుడుకు, పూరన్ ఎదురు దాడి తోడు కావడంతో వెస్టిండీస్ స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. వీరిద్దరి బ్యాటింగ్ దూకుడుతో 11 ఓవర్లలోనే వెస్టిండీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ లక్ష్య చేదనలో వెస్టిండీస్ ఆటగాళ్లు 11 సిక్సర్లు, 7ఫోర్లు కొట్టడం విశేషం