Uttar Pradesh: అదృష్టం బాగుండకపోతే అరటిపండు తిన్నా పన్ను ఊడిపోతుందన్న సామెత ఒకటి ఉంది. అదే సమయంలో భూమి మీద నూకలు బాకీ ఉంటే ఎలాంటి ప్రమాదమైన తప్పుతుందన్న పెద్దలు మాట గుర్తొస్తుంది. అచ్చం అలాంటి అనుభవమే ఉత్తరప్రదేశ్ లోని ఓ మహిళకు ఎదురైంది. పట్టాలు తప్పి రైల్వేట్రాక్ పై పడిపోయిన ఆమెపై ఏకంగా ఓ గూడ్సు రైలు వెళ్లింది. కానీ ఆమె బతికి బట్ట కట్టింది. భూమి మీద తనకు నూకలు బాకీ ఉన్నాయని నిరూపించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాస్ గంజ్ లో బాబుపుర్ అనే గ్రామం ఉంది. ఏ చిన్న అవసరానికి అయినా ఆ గ్రామస్థులు రైల్వేస్టేషన్ దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన హరి ప్యారీ అనే మహిళ మందులు కొనేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. సరిగ్గా రైల్వేస్టేషన్ లో ట్రాక్ దాటే క్రమంలో స్పృహ తప్పి పడిపోయింది. స్టేషన్ లో ఉండే ప్రయాణికులు ఆమెను రక్షించబోయేసరికి ట్రాక్ లో గూడ్సు రైలు వచ్చింది. దీంతో ఆమె ట్రాక్ మధ్యన ఉండిపోయింది రైలు శబ్ధానికి మెలకువ వచ్చింది. అక్కడుండే వారు కదలకుండా ఉండాలని సూచించడంతో అలానే ఉండిపోయింది. రైలు వెళ్లిన తరువాత స్వల్ప గాయాలతో ఆమె బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మృత్యుంజయురాలిగా నిలిచిన హరి ప్యారీకి అందరూ అభినందించారు. కానీ ఆ షాక్ నుంచి మాత్రం ఆమె తేరుకోలేదు. ప్రాణాలు పోయాయనుకున్నాను కానీ.. భగవంతుడి దయ వల్ల బయటపడగలిగానని కన్నీటిపర్యంతమవుతూ చెబుతున్నారు. ఆ సమయంలో తనకు కుటుంబసభ్యులు కనిపించారని.. ఊపిరిబిగబట్టి అలానే ఉండిపోయానని హరి ప్యారీ చెబుతున్నారు.