Homeజాతీయ వార్తలుMLA Raghunandan Rao: తప్పుడు వార్తలకు పుల్ స్టాప్ పెట్టండి.. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు...

MLA Raghunandan Rao: తప్పుడు వార్తలకు పుల్ స్టాప్ పెట్టండి.. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు వేడుకోలు..!

MLA Raghunandan Rao: తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన రావు. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే గతంలో అమితంగా ఇష్టపడిన ఆయన.. ఇప్పుడు అదే కెసిఆర్ పై కాలు దువ్వుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ అంగ బలం, అర్థ బలాన్ని తట్టుకొని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అటువంటి రఘునందన్ రావు బిజెపిపై అసంతృప్తిగా ఉన్నారంటూ కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై కథనాలు కూడా వచ్చాయి. తాజాగా రఘునందన్ రావు స్పందించారు. తాను అధిష్టానానికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ ఢిల్లీ సమావేశంలో స్పష్టం చేశారు.

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకుల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒకరు. గత కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. తనకి ఏదో ఒక కీలక పదవిని కట్టబెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే, పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు. అయితే, కొద్ది రోజుల కిందట కిషన్ రెడ్డిని కలిసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం సాయంత్రం మీడియా ముఖంగా వెల్లడించారు.

బిజెపిలో కీలక పదవి కోసం రఘునందన్ రావు ప్రయత్నం..

దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలో తనకు ప్రాధాన్యం పెరుగుతుందని రఘునందన్ రావు భావించారు. అయితే, బిజెపి అధిష్టానం ఆ దిశగా అవకాశాన్ని కల్పించకపోవడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల కిందట ఆయన తన మనసులోని మాటని బిజెపి నాయకులకు చెప్పారు. రాష్ట్రంలోని మూడు కీలక పదవుల్లో ఏదో ఒకటి తనకి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ అవకాశం కల్పించకపోవడం పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న తనకు అధ్యక్ష పదవి కానీ, శాసనసభాపక్ష పదవి కానీ, జాతీయ కార్యదర్శి పదవి గాని ఇవ్వాలంటూ ఆయన కోరుతున్నారు. అయితే, దీనిపై కేంద్రం నాయకత్వం నుంచి గాని, రాష్ట్ర నాయకత్వం నుంచి గాని ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో కొద్దిరోజులు కిందట బిజెపి అగ్ర నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కథనాలు రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై స్పందించిన కేంద్ర నాయకత్వం ఆయనను ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. దీంతో అగ్ర నాయకులతో సమావేశమైన తర్వాత.. ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు

ఇంతకీ రఘునందనరావు ఏమన్నారంటే..

కొద్ది రోజులు కిందట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకు పార్టీలో గుర్తింపు ఇవ్వాలని, మూడు పదవుల్లో ఏదో ఒకటి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవికి తాను అర్హుడిని అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపంగా మారుతుందని, రెండు నెలల్లో బిజెపి ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందని వెల్లడించారు. రెండోసారి కూడా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాను అని స్పష్టం చేశారు. అమిత్ షా ప్రచారం చేయలేదని, తనకు దుబ్బాక ఎన్నికల్లో ఎవరు సాయం చేయలేదని, పార్టీలోనే ఉండాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు. మునుగోడులో రూ.100 కోట్లు పెట్టినా బిజెపి గెలవలేదని, సొంతంగా తాను దుబ్బాక ఎన్నికల్లో గెలిచానని, అదే రూ.100 కోట్లు తనకి ఇస్తే తెలంగాణను దున్నేసే వాడినని, బిజెపిని చూసి కాకుండా తనను చూసి ఓట్లు వేశారని స్పష్టం చేశాడు. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్ కు రూ.100 కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, బీజేపీ డబ్బులో తనకు వాటా ఉందని, పేపర్ ప్రకటనలో ఈటెల బొమ్మ, తన బొమ్మ ఉంటే ఓట్లు వస్తాయని, పార్టీకి శాసనసభ పక్ష నేత లేడు అనే విషయం జెపి నడ్డాకు తెలియదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఈ వ్యాఖ్యలు అనేక ఛానల్స్, పత్రికల్లో కథనాలు రావడంతో బిజెపి అధిష్టానం ఆయనకు ఢిల్లీకి పిలిపించింది.

మాట మార్చిన ఎమ్మెల్యే రఘునందనరావు..

గతంలో తాను చేసిన వ్యాఖ్యలను అపార్ధం చేసుకున్నారంటూ ఢిల్లీలో మీడియాతో సోమవారం సాయంత్రం మాట్లాడిన రఘునందన్ రావు స్పష్టం చేశారు. తన పార్టీ కోసం శ్రమిస్తున్న ఎలాంటి పదవి లేకపోయినా పార్టీ నాయకత్వాన్ని దిక్కరించే వాడిని కాదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా బీజేపీ కోసం 10 ఏళ్లుగా శ్రమిస్తున్నానంటూ రఘునందన్ వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని తపిస్తున్నట్లు వివరించారు. తాను సరదాగా మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకుని కథనాలు ప్రచురిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ కోసం పని చేస్తానని, బిజెపి అధికారంలోకి రావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. దయచేసి తనపై దుష్ప్రచారాన్ని నిలిపేయాలంటూ మీడియాను ఆయన కోరారు. గంటలు వ్యవధిలోనే రఘునందన్ రావు మాట మార్చేయడంపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రఘునందన్ రావుకు కేంద్ర నాయకత్వం ఏదైనా హామీ ఇచ్చిందా..? అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారా..? అన్నదానిపైనా ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది.

Exit mobile version