Mancherial: గురువు తప్పటడుగు.. బడిలోనే మందు పార్టీ.. వీడియో వైరల్‌

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి పంచాయతీ పరిధిలోని చర్లపల్లి మండల పరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠశాల సమయంలోనే మద్యం తాగాడు.

Written By: Raj Shekar, Updated On : March 1, 2024 10:33 am
Follow us on

Mancherial: గురువు.. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే స్థానం తల్లిదండ్రులు తర్వాత గురువులదే. తల్లిదండ్రులును పిల్లలు ఎలా అనుకరిస్తారో.. గురువులను కూడా అలాగే అనుకరిస్తారు. అందుకే గురువులు ఆదర్శంగా ఉండాలని ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడో గురువు దారితప్పాడు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఆయన బడినే బార్‌గా మార్చాలనుకున్నాడు. ఒకవైపు పాఠశాల నడుస్తుండగానే మరోవైపు తన మిత్రుడితో కలిసి మందు కొట్టాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి పంచాయతీ పరిధిలోని చర్లపల్లి మండల పరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠశాల సమయంలోనే మద్యం తాగాడు. పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో చెట్ల నీడన పాఠాల బోధిస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయురాలు సునంద అనారోగ్యం కారణంగా మడు రోజులుగా సెలవులో ఉంది. దీంతో దుగ్నెపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు రాజు కాంబ్లేను అధికారులు చర్లపల్లికి పంపించారు.

పాఠశాలకు వచ్చిన యువకుడు..
దుగ్నెపల్లి గ్రామానికి చెందిన ధనుంజ్‌ అనే యువకుడు ఫిబ్రవరి 29న పాఠశాలకు వచ్చాడు. ఆయన తన వెంట మద్యం తీసుకువచ్చాడు. దీంతో ఉపాధ్యాయుడు సదరు యువకుడు కలిసి పాఠశాల వెనకకువెళ్లి మద్యం సేవించారు. దీనిని గమనించిన గ్రామానికి చెందిన కొందరు సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. పాఠశాలలో మద్యం సేవించడంపై నిలదీయడమే కాకుండా ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎంఈవో, అప్పటికే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో డీఈవోకు నివేదిక అందించారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌..
పట్టపగలు బడిలో మద్యం సేవించిన ఉపాధ్యాయడు రాజు పై ఇచ్చిన నివేదిక ఆధారంగా డీఈవో యాదయ్య అతడిని సస్పెండ్‌ చేశారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో మద్యం తాగిన ఘటనపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.