Meridian Restaurant Issue: రైతా అడిగినందుకు.. ఓ హోటల్ యాజమాన్యం ఓ కస్టమర్ పై దాడి చేసింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక అతడు మరుసటి రోజు కన్నుమూశాడు. సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వార్త జనజీవన స్రవంతిలోకి వచ్చింది. అదే సోషల్ మీడియా లేకుంటే.. అసలు ఆ సంఘటన జరిగిందన్న విషయం బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే ప్రధాన మీడియాను హైదరాబాద్ హోటల్ నిర్వాహకులు మేనేజ్ చేస్తున్నారు. పోలీసులకు కూడా ప్రతి ఫలాలు ఇస్తుండడంతో వినియోగదారుల గోడును పట్టించుకునే వారే కరువవుతున్నారు. తాజాగా హైదరాబాద్ పంజాగుట్టలోని మెరీడియన్ హోటల్లో బిర్యానీ తినడానికి తన స్నేహితులతో వచ్చిన ఓ వ్యక్తి.. ఎక్స్ట్రా రైతా అడిగినందుకు హోటల్ సిబ్బంది చితక బాదారు. అతడు మరుసటి రోజు కన్నుమూశాడు. దీనిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మెరీడియన్ హోటల్ మాత్రమే కాదు చాలా చోట్ల తినేందుకు వెళుతున్న వినియోగదారులు.. అవమానకరమైన రీతిలో తన్నులు తిని వస్తున్నారు. అయితే ఇందులో కొన్ని ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి.
పంజాగుట్టలో హోటల్ మెరీడియన్ కు ఆదివారం మిత్రులతో కలిసి వెళ్లిన యువకుడు విగత జీవిగా మారడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అదనంగా పెరుగు కావాలని అతడు కోరడమే ఈ దాడికి కారణమైంది. అయితే నగరంలో చాలా హోటళ్ళ వాకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించినా, ఫిర్యాదు చేసినా తిట్లు, తన్నులు తినిపిస్తున్నారు. వారాంతాలలో బౌన్సర్లు, రౌడీ షీటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతుంది.
దిల్ షుఖ్ నగర్ లో వారాంతం వచ్చిందంటే చాలు బిర్యాని తీసుకెళ్ళేందుకు ఓ హోటల్ వద్ద గంట పాటు ఎదురు చూడాలి. అంతసేపటి దాకా ఎందుకు ఎదురు చూడాలని ప్రశ్నిస్తే.. హోటల్ నిర్వాహకులు దాడులకు తెగబడుతున్నారు. మాంసాహార వంటకాలతో గుర్తింపు పొందిన కొన్ని హోటళ్ళ నిర్వాకంపై అటు జిహెచ్ఎంసి అధికారులు, ఇటు పోలీస్ శాఖ కు రోజుకు చాలా ఫిర్యాదులుతున్నాయి. విచారణ నిమిత్తం అక్కడికి వెళ్తే తమకు చేదు అనుభవం ఎదురవుతుందని అధికారులు అంటున్నారు. ఆహారం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆలస్యం కావడం, తాగునీరు, దుస్తులపై పడేవిధంగా ఆహారాన్ని సర్వ్ చేయడం, సిబ్బంది మాట తీరు, నాసిరకమైన పదార్థాలు, బిల్లులు, టిప్ విషయంలో డిమాండ్, జీఎస్టీ వంటి అంశాల వద్ద వినియోగదారులతో నిర్వాహకులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఇటీవల అమీర్పేటలోని హోటల్లో బిర్యాని తినేందుకు కొంతమంది వెళ్లారు. బిర్యానీ తింటుండగా బొద్దింక కనిపించింది.. దీంతో వారు ఆ విషయాన్ని హోటల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిర్వాహకులు తమ తప్పును పక్కదారి పట్టించి తినడానికి వచ్చిన వినియోగదారులపై దాడికి దిగారు. పోలీసులు కూడా హోటల్ నిర్వాహకులకు వంత పాడారు.ఇదే హోటల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని వండుతున్నారని ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఒక మహిళ ఫిర్యాదు చేస్తే.. ఆ హోటల్లో వేయిటర్లు ఆమెపై దుర్భాషలాడారు.. పోలీసులు వాళ్లతో గొడవ ఎందుకు అంటూ రాజి కుదిరించి, గొడవను సర్దుమణిగించారు.. ఇక మాదాపూర్ ప్రాంతంలో తెల్లవారుజామున బిర్యాని విక్రయించే నిర్వాహకులు మొదట్లో మంచిగానే ఉండేవారు. గిరాకీ పెరగడంతో వారి తీరు మారింది. అయితే ఓ వినియోదారుడు తాను తీసుకున్న బిర్యానికి చెల్లింపులను ఆన్లైన్లో ద్వారా చేస్తానని చెబితే.. వారు అతడి చెంప చెల్లుమనిపించారు. ఇక టోలిచౌకిలోని ఓ హోటల్ లో భోజనం చేసేందుకు వెళ్లిన ఓ జంటపై అక్కడి సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. అతడు ఒక పోలీస్ అధికారి కావడంతో తదుపరి చర్యలు వేగవంతంగా జరిగాయి. ఆ స్థానం లో ఉన్నది ఓ సామాన్యుడైతే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఐటీ ఉద్యోగులకు నెలవైన రాయదుర్గం ప్రాంతంలో హోటళ్ళ ముందు అడ్డదిడ్డంగా వాహనాల నిలిపినా పోలీసులు పట్టించుకోవడం లేదు. తాజాగా మెరీడియన్ ఘటనతో హైదరాబాద్ హోటల్ నిర్వాహకుల వ్యవహార శైలి మరొకసారి వెలుగులోకి వచ్చింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.