Anantapur: సభ్య సమాజంలో ఇలా ‘మానవత్వం’ చచ్చిపోయింది

ఆత్మకూరుకి చెందిన కిరణ్ కుమార్ 2003లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు . ఐదేళ్లపాటు గ్రేహౌండ్స్ లో పనిచేశారు. 2014లో ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కానిస్టేబుల్ గా కన్వర్షన్ తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : August 10, 2023 9:37 am

Anantapur

Follow us on

Anantapur: మాయమైపోతున్నడన్న మనిషన్నవాడు’ ఓ సినీ రచయిత చెప్పుకొచ్చిన మాట అక్షరాల వాస్తవమని తేటతెల్లమైంది. అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన కళ్ళకు కట్టినట్టు చూపించింది. మనిషిలో జాలిగుణం పోయిందనడానికి మచ్చుతునకగా నిలిచింది. కళ్ళ ఎదుటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న దంపతుల ఆర్తనాదాలు వింటున్న జనం.. ప్రేక్షకులు మాదిరిగా మిగిలారే తప్ప.. కాపాడే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా.. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

ఆత్మకూరుకి చెందిన కిరణ్ కుమార్ 2003లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు . ఐదేళ్లపాటు గ్రేహౌండ్స్ లో పనిచేశారు. 2014లో ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కానిస్టేబుల్ గా కన్వర్షన్ తీసుకున్నారు. అప్పటినుంచి అనంతపురంలో విధులు నిర్వహిస్తున్నారు. భార్య అనిత సింగనమల మండలం తరిమెల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. వారికి యశ్వంత్ నారాయణ, మణిదీప్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అనంతపురం ఎస్బిఐ కాలనీలో సొంత ఇల్లు కట్టుకుని నివాసముంటున్నారు. కిరణ్ కుమార్ ప్రతిరోజు భార్యను ద్విచక్ర వాహనంలో సోమల దొడ్డి క్రాస్ వద్దకు తీసుకెళ్లి బస్సు ఎక్కించేవారు. బుధవారం ఉదయం ఇదే మాదిరిగా ద్విచక్ర వాహనంపై దంపతులు బయలుదేరారు. స్థానిక గోపాల్ దాబా సమీపంలో 44వ జాతీయదారిపై ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పడం తో దంపతులిద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం వారిపై నుంచి వెళ్లడంతో కిరణ్ రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. భార్యకు తలపై తీవ్ర గాయం అయింది. అంతటి గాయాలతో దంపతులిద్దరూ ఒకరికొకరు సపర్యలు చేసుకోవడం విశేషం. పిల్లలిద్దరినీ తలచుకొని తమను కాపాడండి అంటూ అక్కడ ఉన్న వారిని వేడుకొన్నారు. కానీ చుట్టుపక్కల ఉన్న జనం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కనీసం వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయలేదు. 108 ఫోన్ చేసి ఊరుకున్నారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికి కిరణ్ మృతి చెందారు. ఆయన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

Anantapur

అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీస్ సంఘం ప్రతినిధులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే కిరణ్ కు వైద్యం అందిస్తున్నారు. అన్నా నన్ను బతికించండి అంటూ సంఘ ప్రతినిధులకు కిరణ్ ప్రాధేయపడ్డాడు. పిల్లలను తలచుకుని బాధపడ్డాడు. దీంతో పోలీస్ సంఘం ప్రతినిధులు కన్నీటి పర్యంతమయ్యారు. కిరణ్ కాపాడడానికి వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అక్కడ కొద్దిసేపటికి కిరణ్ కన్నుమూశాడు. ప్రస్తుతం ఆయన భార్యకు వైద్య సేవలు అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అక్కడ వైద్యులు చెబుతున్నారు.