Uttar Pradesh: కోడలిని కూతురులా చూసుకోవాలంటారు. కోడలు కూడా మామలో తండ్రిని చూసుకుంటుంది. అలా వారి కుటుంబంలో మమేకమై తన సర్వస్వాన్ని వారి కోసం ధారపోస్తుంది. భర్త కుటుంబ సంతతి పెరిగేందుకు దోహదపడుతుంది. కానీ కొన్ని సంఘటనలు విస్తు గొలుపుతుంటాయి. చాలా సందర్బాల్లో వింటుంటాం. కోడలిపై కన్నేసిన మామ అనే వార్తలు కలవరపెడుతుంటాయి. ఇక్కడ మామ ఏకంగా కోడలినే పెళ్లి చేసుకున్నాడు. దీంతో వారి విషయం కాస్త వైరల్ గా మారింది. కట్టుకున్న వాడు కాలం చేయడంతో మామ కోడలిని మనువాడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

ఉత్తరప్రదేశ్ లోని బర్హల్ గంజ్ కొత్వాలి ప్రాంతంలో ఛపియా ఉమ్రాన్ అనే గ్రామంలో కైలాష్ యాదవ్ అనే వృద్ధుడి కుటుంబం నివసిస్తోంది. అతడు బర్హల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య 12 ఏళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఇతడికి నలుగురు కుమారులు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు చేశాడు. కానీ మూడో కుమారుడు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో కోడలు పూజ (28) ఒంటరిగా ఉంటోంది. ఆమెకు మరో పెళ్లి చేసినా అతడిని వదిలేసి కైలాష్ కుటుంబంతోనే ఉంటోంది.
ఈ నేపథ్యంలో మామ కోడలి మధ్య సన్నిహిత్యం పెరిగింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. దీంతో వీరిద్దరు వయసులు వేరైనా ఒక్కటి కావాలని అనుకున్నారు. ఏకంగా కోడలి మెడలోనే తాళికట్టాడు కైలాష్. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కోడలిని కన్న కూతురులా చూసుకోవాల్సిన మామ తాళి కట్టి భర్త కావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. కొడుకు భార్యనే ఆలిగా చేసుకున్న ఘటన అందరిలో సందేహాలు కలిగిస్తోంది. ఈ వయసులో అతడు పెళ్లి చేసుకుని ఏం చేస్తాడని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు వారు మాత్రం నవ దంపతుల్లా కనిపిస్తున్నారు. మామ కోడలు మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్లి దారి తీయడమే విచిత్రంగా ఉంది. పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన వారిని కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వధూవరులు సమాధానాలు చెప్పడం లేదట. ఊరంతా వారి బంధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వీరి పెళ్లి ప్రస్తుతం రాష్ర్టంలో హాట్ టాపిక్ అవుతోంది. కాటికి కాళ్లు చాపే వయసులో అతడి నిర్వాకాన్ని అసహ్యించుకుంటున్నారు.