Heart Attack: ప్రాణాలు నీటి బుడగలాంటివే అనడం వింటుంటాం. కానీ ఇపుపడు చూస్తున్నాం. కొన్ని రోజులుగా వయసుతో సంబంధం లేకుండా గుండె ఆగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికే గుండె సంబంధ సమస్యలు వచ్చేవి. హార్ట్ స్ట్రోక్.. హార్ట్ ఎటాక్‌కు గురయ్యేవారు. కానీ రెండు మూడేళ్లుగా చిన్న పిల్లలు కూడా గుండె పోటుతో చినిపోతున్నారు. అప్పటి వరకు అందరితో కలిసి ఆనందంగా గడుపుతూ ఒక్కసారిగా ఊపిరి వదులుతున్నారు. తాజాగా గుజరాత్‌లో 19 ఏళ్ల యువకుడు గర్బా డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు.
జామ్‌నగర్‌లో ఘటన..
గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్‌కు చెందిన 19 ఏళ్ల వనీత్ మెహుల్‌భాయ్ కున్వారియా కొన్ని రోజులుగా గర్బాడాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాబోయే దేవీ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నాడు. బుధవారం కూడా వనీత్ డాన్స్ ప్రాక్టీస్‌కు వచ్చాడు. డాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, గుండెపోటుతో వనీత్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గతంలో గుజరాత్‌లోని జునాగఢ్‌లో చిరాగ్ పర్మార్ అనే 24 ఏళ్ల యువకుడు గర్బా డాన్స్ సాధన చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించాడు. జామ్‌నగర్‌తోపాటు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో జిమ్‌లు, క్రికెట్ గ్రౌండ్‌లు, పాఠశాలల్లో గుండెపోటు కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి.
గర్బా పోటీల్లో గెలవాలని..
జునాగఢ్ వాసి అయిన వనీత్ మెహుల్‌భాయ్ కున్వారి పదేళ్లుగా ఏటా దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే గర్బా పోటీల్లో పొల్గొంటున్నాడు. ఈ ఏడాది కూడా పోటీలో విజయం సాధించేందుకు ప్రాక్టిస్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బుధవారం డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. కొన్ని నెలల క్రితం జామ్‌నగర్‌కు చెందిన 41 ఏళ్ల కార్డియాక్ డాక్టర్ తన సొంత ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.