Lightning Strikes Odisha: వర్షాలు ఒడిశాను వణికిస్తున్నాయి. ఉరుములు, పిడుగులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు గంటల వ్యవధిలో 61 పిడుగులు పడ్డాయి. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రత్యేక రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహూ తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ఒడిశా రాష్ట్రంలో ప్రధానంగా గజపతి, జగత్ సింగ్ పూర్, పూరీ, జలంగీర్ తదితర జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఖుర్దా జిల్లాలో అసాధారణ వర్షం కురిసింది. ఈ జిల్లాలో పిడుగులు పడి నలుగురు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నారాజ్ లో 13 అత్యధికంగా 13 సెంటీమీటర్ల, పిపిలిలో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడడంతో మొత్తం ఆయా జిల్లాల్లో కలిపి 12 మంది మరణించారు.
రానున్న 48 గంటల్లో వాయుగుండం అల్పపీడనం గా మారే అవకాశం ఉంది, సెప్టెంబర్ 7 వరకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ తరుణంలో వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండొద్దని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో కొన్ని గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7 వరకు ప్రజలు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా మందికి బాహ్య సంబంధాలు తెగిపోయాయి. దీంతో వారు బయటకు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షం భారీగానే కురుస్తోంది. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ తో పాటు మేడ్జల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్ష ఉధృతి కొనసాగుతోంది.