Chittaranjan Das: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఎవరు ఏ పార్టీలో చేరుతారో అంతు పట్టకుండా ఉంది. మొన్నటిదాకా భుజం భుజం రాసుకుని తిరిగిన నాయకులు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని విమర్శలు చేసుకున్నవారు ఇప్పుడు భాయ్ భాయ్ అని తిరుగుతున్నారు. రాజకీయాలంటేనే అలా ఉంటాయి కాబట్టి.. అందులోనూ పరస్పర ప్రయోజనాలు మాత్రమే మిళితమై ఉంటాయి కాబట్టి.. ఇందులో ఎవర్ని తప్పు పట్టేందుకు అవకాశం లేదు.. తాజాగా భారతీయ జనతా పార్టీలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోబోతోంది.. పూర్వకాలంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ను ఓడించిన చిత్తరంజన్ అనే సీనియర్ భారత రాష్ట్ర సమితి నాయకుడు త్వరలో కమలం పార్టీలో చేరబోతున్నారు అనే వార్త మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అదే భారతీయ జనతా పార్టీలో ఉన్న ఇద్దరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని తెలియడం కమలనాథుల ఉత్సాహాన్ని నీరు గారుస్తోంది.
భారతీయ జనతా పార్టీలోకి జెయింట్ కిల్లర్
ఈ తరం వారికి చిత్తరంజన్ అంటే ఎవరో తెలియకపోవచ్చు.. 1980 లో పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేసింది. 1989లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద చిత్తరంజన్ పోటీ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ ను ఓడించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ విజయం ద్వారా చిత్తరంజన్ జెయింట్ కిల్లర్ గా అవతరించారు. దాదాపు 3568 ఓట్ల తేడాతో ఎన్టీఆర్ ను చిత్తరంజన్ ఓడించడం అప్పట్లో ఒక సంచలనం. ఆ గెలుపుతో చిత్తరంజన్ మంత్రి అయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో పర్యటక, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
1994 లో ఓటమి
ఆ తర్వాత 1994 ఎన్నికల్లో చిత్తరంజన్ ఓడిపోయారు.1999 లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో టిడిపిలో చేరారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు.. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ గా పని చేశారు. 2009 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి తన విధేయతను చాటుకున్నారు.. 2018లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో 2019 లో భారత రాష్ట్ర సమితిలో చేరారు.. కల్వకుర్తి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా… చిత్తరంజన్ కు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆయన భారత రాష్ట్ర సమితి మీద ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈ లోగానే భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయనకు టచ్ లోకి వెళ్లడం.. కల్వకుర్తి టికెట్ ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో.. బిజెపిలోకి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే గతంలో ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ నుంచి తల్లోజు ఆచారి పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరి ఇప్పుడు కల్వకుర్తి స్థానం చిత్తరంజన్ కు కేటాయిస్తే.. ఆచారి పరిస్థితి ఏంటి అనేది అంతు పట్టకుండా ఉంది.
వారిద్దరూ బయటికి..
ఇక చిత్తరంజన్ రాకతో బిజెపిలో కొత్త ఉత్సాహం నెలకొంటుంటే.. పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి యన్నం శ్రీనివాస్ రెడ్డి చేరడం దాదాపుగా ఖాయం. ఎందుకంటే ఈయన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ ఈయనను సస్పెండ్ చేసింది.. అయితే దీనిని మనసులో పెట్టుకున్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడు ఏనుగు రవీందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.. పార్టీ తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన కొంతకాలంగా ఒకింత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ భారత రాష్ట్ర సమితి నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు.. ఆయనతోపాటు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.. వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తుల ఉమ భావించారు. దీనికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె పని చేసుకుంటున్నారు. తాజాగా ఇక్కడ మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు చెన్నమనేని సాగర్ రావు పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరిక కార్యక్రమానికి ఈటెల రాజేందర్ గైర్హాజరయ్యారు. ఇక అదే సమయంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కృష్ణ యాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ క్యాంప్ ఆఫీస్ నుంచి మీడియాకు లీకులు కూడా వచ్చాయి. అయితే అదే రోజు వికాస్ రావు పార్టీలో చేరడం.. ఆ కార్యక్రమానికి బిజెపి పెద్దలు హాజరు కావడం.. రాజేందర్ కు నచ్చలేదు. అందుకే కృష్ణ యాదవ్ కు ముందే అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ.. వెంటనే వెళ్లిపోయారు.. దీంతో కృష్ణ యాదవ్ పార్టీలో చేరిక కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా సీనియర్ నాయకుడు ధర్మారావును నియమించింది. మరి ఈ కమిటీ అయినా బిజెపిని గాడిలో పెడుతుందా? ఎన్నికల సందర్భంగా కొత్త శక్తిని ఇస్తుందా? వేచి చూడాలి.. అన్నట్టు కృష్ణ యాదవ్ త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని ఇంకా రాష్ట్ర అధినాయకత్వం ధ్రువీకరించలేదు. ముందుగానే చెప్పినట్టు వచ్చే వాళ్ళు తక్కువ సంఖ్యలో వస్తుంటే.. పోయేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నారు. మరి ఈ పరిణామానికి బిజెపి ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాల్సి ఉంది.