Nobel World Record: అమోఘమైన జ్ఞాపక శక్తి ఆ చిన్నారి సొంతం. ఒక్కసారి చూస్తే చాలు.. ఇట్టే గుర్తు పడుతోంది ఆ ఐదు నెలల చిన్నారి. తన అసమాన ప్రతిభతో అబ్బురపరుస్తోంది. నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ను సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
కృష్ణా జిల్లాకు చెందిన నితిన్, తనుజ దంపతులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరికి ఐదు నెలల కుమార్తె జైత్రీ ఉంది. పుట్టిన కొన్ని రోజులకే చిన్నారిలో జ్ఞాపకశక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. వివిధ మొక్కలను చూపిస్తూ పేర్లను చెప్పేవారు. కొన్ని రోజుల తర్వాత పాప.. వంద రకాల మొక్కల్లో దేని పేరు చెప్పినా .. ఫ్లాష్ కార్డ్ ఆల్బమ్ లో గుర్తించడం ప్రారంభించింది. ఇది ఆ నోటా ఈ నోటా పాకడంతో ప్రాచుర్యం పొందింది. దీంతో నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థ పాప ప్రతిభను పరీక్షించింది. నిజమేనని తేలడంతో సర్టిఫికెట్ అందించింది. పాపకు గుర్తింపు లభించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందించాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు, మనోవికాస నిపుణులు చెబుతుంటారు. పిల్లలను ప్రాథమిక స్థాయి నుంచే జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంటారు. జ్ఞాపకశక్తి అభివృద్ధికి, ఇతర సామర్థ్యాల మాదిరిగానే క్రమం తప్పకుండా అభ్యాసం అవసరం. ఈ ఐదు నెలల చిన్నారి విషయంలో సైతం తల్లిదండ్రులు నితిన్, తనుజాలు అదే చేశారు. పాప జ్ఞాపక శక్తిని గుర్తించడం వారి బాధ్యతను తెలియజేస్తోంది. దాదాపు చాలామంది చిన్నారుల్లో జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. దానిని గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.