https://oktelugu.com/

Nellore YCP: వైసీపీలో నెల్లూరు సిటీ టికెట్ మంట

నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం నాయకులే ఎక్కువగా ప్రాతినిధ్యం వహించారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇచ్చి జగన్ ప్రోత్సహించారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 3, 2024 / 05:47 PM IST
    Follow us on

    Nellore YCP: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు స్థానచలం తప్పలేదు. ఈసారి ఆయన నెల్లూరు సిటీ నుంచి నరసరావుపేటకు షిఫ్ట్ కానున్నారు. అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. ఈ విషయంలో స్పష్టత వచ్చింది కూడా. అయితే నెల్లూరు సిటీ నుంచి ఎవరిని బరిలో దించుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను చెప్పిన వారికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని అనిల్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. లేకుంటే తాను నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనని కూడా తేల్చి చెప్పడానికి అనిల్ సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే ఇందుకు కారణం ఉంది. తాను వ్యతిరేకించే కుటుంబానికి టిక్కెట్ కేటాయించేందుకు జగన్ ప్రయత్నిస్తుండడంతో అనిల్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

    నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం నాయకులే ఎక్కువగా ప్రాతినిధ్యం వహించారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇచ్చి జగన్ ప్రోత్సహించారు. తొలి క్యాబినెట్ లో అనిల్ కు మంత్రి పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. అయితే గత ఎన్నికల్లో అనిల్ తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. ఈసారి పోటీ చేస్తే ఆయన ఓటమి తప్పదని హై కమాండ్ కు నివేదికలు వచ్చాయి. దీంతో అనిల్ కు నరసరావుపేట ఎంపీ స్థానానికి సర్దుబాటు చేశారు.

    మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ ఖరారు అయ్యారు. ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన అభ్యర్థి. ఆపై మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు సిటీని అభివృద్ధి చేశారని పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే అనిల్ ను తప్పించడంతో.. ఈ నియోజకవర్గంలో టీడీపీ పాగా వేస్తుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అందుకే ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దించి నారాయణకు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వేమిరెడ్డి పదవీకాలం రెండు మూడు నెలల్లో పూర్తి కానుంది. అందుకే ఆయనకు నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపుతారని తెలుస్తోంది. వేమిరెడ్డి భార్య నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే తన ఈ పరిస్థితికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కారణమంటూ అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అనిల్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో హై కమాండ్ కు ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది.

    అయితే అనిల్ కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. ఇన్నాళ్లు తనపై అసంతృప్తితో రగిలిపోయిన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని అనిల్ కుమార్ యాదవ్ కోరుతున్నారు. తన తరువాత తన బాబాయ్ నియోజకవర్గ నాయకుడిగా చలామణి అయ్యారని.. ఆయన అయితేనే నెగ్గుకు రాగలరని.. తాను సంపూర్ణంగా మద్దతు తెలుపుతానని అనిల్ చెబుతుండడం విశేషం. అయితే ఇది బాబాయ్ పై అభిమానంతో కాదని.. వేమిరెడ్డి పై ఉన్న కోపంతోనే బాబాయికి సపోర్ట్ చేయాల్సిన అనివార్య పరిస్థితి అనిల్ కు ఎదురైంది. అయితే తన భార్యకు టికెట్ ఇవ్వకుంటే ఎంపీగా పోటీ చేయనని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తేల్చి చెబుతున్నారు.. మరోవైపు బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇవ్వనిదే తాను నరసరావుపేట ఎంపీగా పోటీ చేయనని అనిల్ స్పష్టం చేస్తున్నారు. దీంతో జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఎవరిని సముదాయిస్తారు? అన్నది తెలియాల్సి ఉంది.