Airports: రవాణా వ్యవస్థ అభివృద్ధికి చిహ్నం. రోడ్డు, రైలు మార్గాలు ఉన‍్న పల్లెలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇక అంతర్జాతీయంగా అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయాలు ఉండాలి. విమానాల్లో ప్రయాణికులతోపాటు సరుకుల రవాణా ద్వారా దేశాల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార సంబంధాలు వృద్ధి చెందుతాయి. అందుకే ప్రపంచ దేశాలు విమానాశ్రయాల నిర్మాణానికి ఎక్కువగా ప్రధాన్యం ఇస్తున్నాయి. అనేక దేశాల్లో ఎన్నో అందమైన విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయాలు దేశానికి ప్రవేశద్వారం లాంటివి. ప్రతీ దేశంలోని ప్రధాన నగరాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రపంచంలో వెయ్యికిపైగా విమానాశ్రయాలు ఉన్న ఐదు ప్రధాన దేశాల గురించి తెలుసుకుందాం.
అమెరికాలో ఎక్కువ..
అత్యధిక విమానాశ్రయాలు ఉన్న జాబితాలో అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో అత్యధికంగా 14,712 విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో 102 అంతర్జాతీయ విమానాశ్రయాలు. వీటి నుంచి ఏటా మిలియన్ల మంది ప్రజలు అమెరికాకు రాకపోకలు సాగిస్తున్నారు.
– ఇక ఎక్కువ విమానాశ్రయాలు ఉన్న జాబితాలో రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ దేశంలో మొత్తం 4,093 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు. బ్రెసిలియా అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం.
– వెయ్యికిపైగా విమానాశ్రయాలు ఉన్న దేశాల్లో మెక్సికో మూడో స్థానంలో ఉంది. ఈ దేశంలో 1,714 విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో 36 అంతర్జాతీయ విమానాశ్రయాలు. మెక్సికోలో 2015లో ప్రారంభించిన బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఇక్కడ చాలా విమానాలు దిగుతాయి.
– వెయ్యికిపైగా విమానాశ్రయాలు ఉన్న దేశాల జాబితాలో తర్వాతి స్థానం కెనడాది. ఈ దేశంలో 1,467 విమానాశ్రయాలు ఉన్నాయి. కెనడా స్వచ్ఛమైన పర్యావరణానికి ప్రసిద్ధి. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఏడాది పొడవునా ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు. టొరంటోలోని అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉంటుంది. ఇక్కడికి చాలా దేశాల నుంచి విమానాలు వస్తాయి.
– వెయ్యికిపైగా విమానాశ్రయాలు ఉన్న దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో ఉంది. ఈ దేశంలో 1,218 విమానాశ్రయాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ రష్యా ఐదో స్థానంలో ఉంది. ఒక్క మాస్కోలోనే రెండు పెద్ద, ఒక మధ్యస్థ విమానాశ్రయం ఉన్నాయి. ఏటా 80 మిలియన్లకుపైగా ప్రయాణికులు విమాన సేవలను వినియోగించుకుంటున్నారు.
మన దేశంలో ఎన‍్నంటే..
ఇక భారత దేశంలో ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. భారత్‌లో మొత్త 486 విమానాశ్రయాలు ఉన్నాయి. మన దేశంలో వెయ్యిలో సగం కూడా లేవు. ఇక ఉన్న 486 విమానాశ్రయాల్లో 34 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు. 103 దేశీయ విమానాశ్రయాలు.