
Preeti Case: ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన పీజీ వైద్య విద్యార్థి ధరావత్ ప్రీతి నాయక్ చివరకు మృత్యువు చేతిలో ఓడిపోయింది. ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రీతి మృతిచెందినట్లు నిమ్స్ వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె బ్రతకడానికి ఒక్క శాతం చాన్స్ మాత్రమే ఉందని మంత్రి ఎర్రబెల్లి చెప్పిన కొన్ని గంటలకే ప్రీతి మృతిచెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. మెడికో మృతిపై తెలంగాణ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె ప్రాణానికి కేవలం రూ.10 లక్షలు విలువ కట్టింది. ప్రీతి మరణించినట్లు ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. సోమవారం మెడికల్ కాలేజీల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఆ తండ్రి ప్రశ్నకు దొరకని సమాధానం..
ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు కాకతీయ మెడికల్ కళాశాల యాజమాన్యం ప్రటించింది. విషపూరితమైన ఇంజక్షన్ తీసుకోవడం ద్వారా ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రకటించింది. అయితే ఆమె తల్లిదండ్రులు వచ్చే వరకూ అంతా ప్రేమ వ్యవహారమో, ర్యాగింగ్ భూతం కారణంగా భావించారు. కానీ, ప్రీతి తండ్రి వచ్చాక, సీనియర్ సైఫ్ వేధింపుల విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రీతి తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికిది కాదని..ప్రీతిపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. తమతో ఫోన్ మాట్లాడే సమయంలో తనకు ఏదో జరుగుతుందనే అనుమానం ఉందని చెప్పింది. ఆ తరువాతే తనపై హత్యాయత్నం జరిగుంటుందని తండ్రి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీనియర్ వేధింపులపై ఫిర్యాదు చేసినా హెచ్‌వోడీ, యాజమాన్యం చర్య తీసుకోలేదని పేర్కొన్నారు. ఘటన రోజురాత్రి ఏం జరిగిందో చెప్పాలని ఐదు రోజులుగా తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ప్రీతి మరణించిన తర్వాత కూడా ఆయన ఆరోజు ఏం జరిగిందో చెప్పాలనే డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ స్పందనపై అనుమానాలు..
ప్రతీ ఘటన జరిగిన నాటి నుంచి ప్రభుత్వం స్పందించే తీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రీతిని వేధించిన సీనియర్ సైఫ్ హోంమంత్రి మహమూద్ అలీ బంధువని ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రభుత్వం కూడా ఈ ఘటనపై వేగంగా స్పందించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఆందోళనల తర్వాతనే సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సైఫ్‌కు మద్దతుగా పీజీ విద్యార్థులతో కళాశాలలో ఆందోళన చేయడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ఇక కళాశాల హెచ్‌వోడీ, యాజమాన్యంపై చర్య తీసుకోవడంలోనూ ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం రూ.10 లక్షల పరిహారం..
దాదాపు ఐదు రోజులుగా ప్రీతి మృతిపై ఆందోళనలు జరుగుతున్నాయి. మృత్యువుతో పోరాడిన ప్రతీ ఆదివారం మృతిచెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. మరణం తర్వాత కూడా ప్రభుత్వం పరిహారం చెల్లింపు, బాధిత కుటుంబాన్ని ఆందుకునే విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరించింది. కేవలం రూ.10 లక్షల పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది. అయితే నిమ్స్ వద్ద ప్రీతి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. దీంతో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి కీలక హామీ ఇచ్చారు. రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. అలాగే ప్రీతి మృతిపై ఫాస్ట్రాక్ కోర్టుతో విచారణ జరిపిస్తామని మంత్రులు హామీనిచ్చారు. ప్రీతి మరణంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

మొత్తంగా ఒక మెడికో ఆత్మహత్య, తర్వాత పరిణామాల విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై విమర్శలు కొనసాగుతునే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఇకనైనా జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది.