
Australia vs South Africa 2023 Final: సౌత్ ఆఫ్రికా అద్బుతం చేయలేదు. సెమీ ఫైనల్ మ్యాజిక్‌ను రిపిట్ చేయలేదు. ఆస్ట్రేలియాకు సరెండర్ అయింది. మొత్తంగా ఆరోసారి ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా వేదికగా కేప్ టౌన్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సంచలనాలేమీ చోటు చేసుకోలేదు.. ఫలితం మారలేదు. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరోసారి హ్యాట్రిక్ కొట్టింది అనూహ్య రీతిలో తొలిసారి టైటిల్ పోరుకు చేరుకొన్న ఆతిథ్య సౌతాఫ్రికా ప్రపంచకప్ కల చెదిరిపోయింది. మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. వరుసగా ఏడోసారి తుది పోరుకు చేరిన కంగారూలు.. ఆరోసారి విశ్వవిజేతలుగా నిలిచి రికార్డు సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బెత్ మూనీ (53 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 74 నాటౌట్) అర్ధ శతకంతో రాణించగా.. ఆష్లే గార్డ్‌నర్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) దూకుడుగా ఆడింది. షబ్నిం ఇస్మాయిల్, మరిజన్నే కాప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 137/6 స్కోరుకే పరిమితమైంది. లారా ఉల్వర్డ్ (48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), చ్లో ట్రయాన్ (25) పోరాటం వృథా అయింది. ఆష్లే గార్డ్‌నర్, మేగన్ స్కట్, డార్సీ బ్రౌన్, జొనాసెన్ తలో వికెట్ దక్కించుకొన్నారు. గార్డ్‌నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీ్‌స’గా నిలిచింది.
ఒంటరి పోరాటం
ఓపెనర్ లారా ఉల్వర్డ్ మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడం.. దక్షిణాఫ్రికా ఛేదనను దెబ్బ తీసింది. ట్రయాన్‌తో కలసి నాలుగో వికెట్‌కు లారా 55 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపింది. కానీ, విజయానికి చివరి 30 బంతుల్లో 59 పరుగులు కావాల్సిన సమయంలో ప్రమాదకరంగా కనిపిస్తున్న ఉల్వర్డ్‌ను ఎల్బీ చేసిన మేగన్ మ్యాచ్‌ను ఆసీ్‌సవైపు మొగ్గేలా చేసింది. ఓపెనర్లు లారా, తజ్మిన్ బ్రిట్స్ (10)ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేయడంతో పవర్‌ప్లేలో సౌతాఫ్రికా ఆశించిన రీతిలో స్కోరు చేయలేక పోయింది. బ్రౌన్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి బ్రిట్స్ వెనుదిరిగే సమయానికి దక్షిణాఫ్రికా 17 పరుగులే చేసింది. ఖాప్ (11), లుస్ (2) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కానీ, ట్రయాన్ సహకారంతో లారా ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును నడిపించింది. ఈ క్రమంలో ఉల్వర్డ్ అర్థ శతకం చేసుకోగా.. 15 ఓవర్లలో సౌతాఫ్రికా 98/3తో నిలిచింది. కీలక సమయంలో లారా పెవిలియన్ చేరడంతో ఆతిథ్య జట్టు ఆశలు ఆవిరయ్యాయి.

బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్
మందకొడి వికెట్‌పై ఓపెనర్ బెత్ మూనీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో.. ఆస్ట్రేలియా పోరాడగలిగే స్కోరు చేసింది. తుదికంటా అజేయంగా నిలిచిన మూనీ.. గార్డ్‌నర్‌తో కలసి రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించి జట్టును ఆదుకొంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీ్‌సకు ఓపెనర్లు హీలీ (18), మూనీ శుభారంభాన్నిచ్చారు. మూడు ఫోర్లతో దూకుడుగా ఆడుతున్న హీలీని ఖాప్ క్యాచవుట్ చేయడంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి ఆస్ట్రేలియా 36/1 స్కోరు చేసింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన ఆష్లే గార్డ్‌నర్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో బ్యాట్‌ను ఝుళిపించడంతో స్కోరు వేగం పెరిగింది. కానీ, ప్రమాదకరమైన ఆష్లేను ట్రయాన్ పెవిలియన్ చేర్చడంతో పరుగుల వేగం నెమ్మదించింది. గ్రేస్ (10), కెప్టెన్ మెగ్ లానింగ్ (10) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో బ్యాటింగ్ చేసిన మూనీ.. 17వ ఓవర్ ఫోర్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకొంది. పెర్రీ (7) సహకారంతో ఐదో వికెట్‌కు 33 పరుగులు జోడించిన బెత్.. 6, 4 బాది జట్టు స్కోరును 150 పరుగుల మార్క్ దాటించింది.