Dating Apps: ప్రపంచం మారుతోంది. పద్దతులూ మారుతున్నాయి. భారతీయులు కూడ మారుతున్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి దొర్లుతున్నారు. వైవాహిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. వివాహేతర సంబంధాల మత్తులో మూలుగుతున్నారు. ఒకే భార్య, ఒకే బాణం అన్న రాముడు నడయాడిన నేలలో డేటింగ్ కల్చర్ వేయి పడగలు విప్పి నాట్యమాడుతోంది. డేటింగ్ కోసం అర్రులు చాస్తున్న కొందరి గుట్టు ఓ డేటింగ్ యాప్ రట్టు చేసింది.

గ్లీడెన్ .. ఇది ఫ్రాన్స్ కి చెందిన డేటింగ్ యాప్. ఈ యాప్ వాడేవారు కోటి మంది ఉంటే.. అందులో 20 లక్షల మంది భారతీయులే ఉన్నారట. ఇది గ్లీడెన్ యాప్ ఇచ్చిన సమాచారం. గ్లీడెన్ యాప్ ఉపయోగించే భారతీయులు సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారేనట. వీరిలో పురుషులు, మహిళలూ ఉన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, మేనేజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, కన్సెల్టెంట్లు, వ్యవస్థాపకులు.. ఇలా అన్ని రంగాల వారు గ్లీడెన్ డేటింగ్ యాప్ వాడుతున్నారని డేటింగ్ యాప్ వెల్లడించింది.
గ్లీడెన్ యాప్ వాడే మహిళల్లో అధిక సంఖ్యలో గృహిణులు ఉన్నారు. 26 ఏళ్ల పైన వయసు ఉన్న మహిళలు, 30 ఏళ్ల వయసు ఉన్న మగవారు ఎక్కువగా గ్లీడెన్ డేటింగ్ యాప్ వాడుతున్నారని డేటా బయటికొచ్చింది. 2023లో 60 శాతం పురుషులు , 40 శాతం మహిళలు ఈ యాప్ వాడుతున్నారని గ్లీడెన్ తెలిపింది. గ్లీడెన్ యాప్ వివాహితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్. కనుక అందరూ వివాహితులే ఈ యాప్ వాడుతున్నారని చెప్పింది.

సంస్కృతికి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. ఇలాంటి చోట పాశ్చాత్య సమాజం వెంట పరుగులు తీయడం బాధాకరం. భారతీయ సంస్కృతిలో వైవాహిక బంధానికి ఎంతో విశిష్ఠత ఉంది. వివాహాన్ని ఒక మహత్కార్యంగా భావిస్తారు. ఇలాంటి దేశంలో డేటింగ్ పట్ల మోజు పెరగడం అవాంఛనీయం. వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో చిచ్చుకు కారణమవుతాయి. ఎన్నో కాపురాలు కూలిపోతాయి. ఎందరో వీటికి బలైపోతారు. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రుల ఆలనాపాలనకు దూరమవుతారు. డేటింగ్ సంస్కృతి సమాజానికి, కుటుంబ వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.