AP Govt Employees: ఒకటో తేదీ రాగానే భయం.. భయం. పాలవాడు వస్తాడు. పేపరువాడు వస్తాడు. జీతమేమో రాకపాయే. జేబులో చిల్లిగవ్వ లేకపాయే. దిక్కుతోచదు ఆ ఉద్యోగికి. ఇరుగు పొరుగు అప్పు అడుగుదామంటే మనసొప్పదు. అందరిదీ అదే పరిస్థితి. పాలవాడిని, పేపరువాడిని ఇంకొన్ని రోజులు ఆగండని సర్దిచెప్పడమే. అంతకు మించి చేసేదేంలేదు. ఇది ఏపీ ఉద్యోగుల దుస్థితి.

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు. దాచుకున్న సొమ్ము ఇవ్వడం లేదట. ఆదుకోండి మహాప్రభో అంటూ ఉద్యోగులు గవర్నర్ ని కలిశారు. గవర్నర్ ఎదుట ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. సమయానికి జీతాలు ఇవ్వడం లేదని, జీపీఎఫ్ డబ్బులూ వెనక్కి తీసుకున్నారని వాపోయారు. ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని అడిగినా చలనం లేకపోవడంతో గవర్నర్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బు కనీసం ఇరవై వేల కోట్లు ప్రభుత్వం చెల్సించాల్సి ఉందట.
బకాయిలు త్వరగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని ఉద్యోగులు కోరారు. ఆర్టికల్ 309 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల పై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు గవర్నర్ కు ఉంటాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. గవర్నర్ జోక్యం చేసుకోకపోతే ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఉద్యోగులు వెల్లడించారు. ఒకటో తేదీ నుంచి 15 వరకు జీతాలు పడుతూనే ఉంటాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

ఉద్యోగులు, పెన్షనర్లు, దినసరి కార్మికులకు ఒకటో తేదీన లేదా ముందు నెల 30 వ తేదీన జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. సంక్రాంతి నుంచి బకాయిలు ఇస్తామని చెప్పి ఇంత వరకు ఇవ్వలేదని తెలిపారు. మళ్లీ ఏప్రిల్ నుంచి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని ఉద్యోగులు వాపోయారు. ఏప్రిల్ నుంచి బకాయిలు ఇవ్వకపోతే తీవ్రస్థాయి ఉద్యం చేపట్టాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఏపీ ఉద్యోగులు జీతాల సమస్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.