Jharkhand: ప్రపంచంలోనే భారత వివాహ వ్యవస్థకు అరుదైన చరిత్ర ఉంది. దాంపత్య జీవితానికి ప్రపంచ దేశాలే ఫిదా అవుతాయి. కానీ ఇటీవల కొన్ని విపరీత పోకడలతో వివాహ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. సహజీవనం, విడాకులు, భరణం వంటి వాటితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్వేచ్ఛకు భంగం పేరిట దంపతులు సైతం విడిపోతున్నారు. విభేదాల కారణంతో కొంతమంది విడిపోతుండగా.. విధి కొన్ని జంటలను దూరం చేస్తోంది. భాగస్వామి దూరమైతే వితంతువుగా మిగిలే ఒంటరి మహిళ ప్రయాణం చాలా కష్టం. అందులో పిల్లలు ఉన్నారంటే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరం. ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఝార్ఖండ్ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం విశేషం.
ధారణంగా రెండో పెళ్లి అంటేనే చిన్న చూపు చూస్తారు. సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో సంకెళ్లు వేస్తుంటారు. ఇటువంటి వాటిని నియంత్రించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం విద్వ పునర్వివాహ్ ప్రోత్సాహం యోజన అనే పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. వితంతువులను రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ పథకం తెచ్చింది. వివిధ కారణాలతో జార్ఖండ్లో ఎక్కువ మంది పురుషులు చనిపోతున్నారు. దీంతో వితంతువులుగా మారుతున్న మహిళల జీవితం దుర్భరంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
మొదటి భర్త డెత్ సర్టిఫికేట్ ను, రెండో పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ను అర్హులైన మహిళలు అధికారులకు సమర్పిస్తే.. ఆ మహిళ బ్యాంకు ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక నిబంధన అమలు చేస్తున్నారు. రెండో పెళ్లి చేసుకున్న ఏడాది లోపు సర్టిఫికెట్లు సమర్పించిన వారికి మాత్రమే నగదు సాయం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ తీసుకునే వారికి, ఆదాయ పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.