India vs England : చారిత్రాత్మకమైన లార్డ్స్ మైదానంలో టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు..ప్లాట్ పిచ్ పై అద్భుతంగా బంతులు వేసి అదరగొట్టాడు. తద్వారా నాలుగు వికెట్లు పడగొట్టి తన కెరియర్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.. ఇంగ్లాండ్ జట్టులో అత్యంత ప్రమాదకరమైన రూట్, స్టోక్స్, స్మిత్, బషీర్ వికెట్లను పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులకు ఆల్ అవుట్ అయింది..
ఓవర్ నైట్ స్కోర్ 2 పరుగులతో నాలుగో రోజు రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్లు ధాటికి బెంబేలెత్తిపోయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో రూట్, స్టోక్స్ ఐదో వికెట్ కు నెలకొల్పిన 67 పరుగులే అత్యుత్తమ భాగస్వామ్యం అంటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. జట్టు స్కోర్ 22 పరుగుల వద్ద ఉన్నప్పుడు డకెట్ రూపంలో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగుల వద్ద పోప్, 50 పరుగుల వద్ద క్రావ్ లీ, 87 పరుగుల వద్ద బ్రూక్, 154 పరుగుల వద్ద రూట్, 164 పరుగుల వద్ద స్మిత్, 181 పరుగుల వద్ద స్టోక్స్, 182 పరుగుల వద్ద కార్సే, 185 పరుగుల వద్ద వోక్స్, 192 పరుగుల వద్ద బషీర్ వికెట్ ను ఇంగ్లాండ్ కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టు చివరి 4 వికెట్లను 28 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం.
టీమిండియాలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. సిరాజ్, బుమ్రా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. ఆకాష్ దీప్ కు గాయం కావడంతో సిరాజ్, బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి మీద ఒత్తిడి పడకుండా ఉండడానికి జడేజా, వాషింగ్టన్ సుందర్ కు టీమిండియా కెప్టెన్ గిల్ బౌలింగ్ ఇచ్చాడు. ఇందులో జడేజా వికెట్లు తీయకపోయినప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు.. సుందర్ మాత్రం అద్భుతమైన బంతులు వేసి ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు . తద్వారా తన టెస్ట్ కెరియర్ లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. ఇంగ్లాండ్ 192 పరుగులకు కుప్పకూలిన నేపథ్యంలో.. భారత్ 193 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. భారత జట్టుకు ఇంకా ఒకరోజు మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతం చేయాలి.