Harish Rao About Srujan Reddy: ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా గులాబీ పార్టీ ప్రముఖంగా ప్రస్తావించిన పేరు సృజన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈయన పేరునే ఆ పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా తెరపైకి తీసుకొచ్చింది.. అంతేకాదు గులాబీ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావు ఇటీవల సుదీర్ఘకాలం విలేకరుల సమావేశం నిర్వహించి.. అందులో సృజన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బావమరిది అంటూ విమర్శించారు.
సృజన్ రెడ్డికి సింగరేణిలో కీలకమైన కాంట్రాక్టులు దక్కుతున్నాయని.. దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని.. సృజన్ రెడ్డి ఎంత చెబితే సింగరేణిలో అంత అన్నట్టుగా సాగుతోందని హరీష్ రావు ఆరోపించారు. అమృత్ పథకంలో కాంట్రాక్టుల నుంచి మొదలుపెడితే సింగరేణి వరకు ప్రతి విషయంలో సృజన్ రెడ్డి చెప్పిందే సాగుతోందని హరీష్ రావు విమర్శించారు. నైనీ బ్లాక్ వ్యవహారంలో సృజన్ రెడ్డి ది కీలక పాత్ర అంటూ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు.
హరీష్ రావు పదేపదే ప్రస్తావిస్తున్న సృజన్ రెడ్డికి గులాబీ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఉపేందర్ రెడ్డితో దగ్గర సంబంధం ఉంది. ఉపేందర్ రెడ్డి అలియాస్ కందాళ ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యేగా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. సివిల్ కాంట్రాక్టర్ గా ఉన్న ఉపేందర్ రెడ్డి 2009లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజవర్గం నుంచి పోటీచేయాలని అనుకున్నారు. అయితే పాలేరు నియోజకవర్గంలో దివంగత రామిరెడ్డి వెంకటరెడ్డి ఆధిపత్యం కొనసాగేది. ఆ నియోజకవర్గంలో ఆయన వరుసగా గెలిచారు. దీంతో 2009, 2014 సంవత్సరాలలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఉపేందర్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మరణం తర్వాత ఉపేందర్ రెడ్డికి అనివార్యంగా పొలిటికల్ పాత్ లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పాలేరు టికెట్ సాధించుకున్నారు ఉపేందర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద ఏకంగా ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పేరుతో గులాబీ పార్టీలో చేరారు.
ఉపేందర్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు దీపికా రెడ్డి. ఈమె భర్త పేరు సురేందర్ రెడ్డి. ఈయన హైదరాబాదులో గ్యాస్ట్రో వైద్యుడిగా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె పేరు దీప్తి రెడ్డి ఈమె భర్త పేరు సృజన్ రెడ్డి. హరీష్ రావు పదేపదే ఆరోపిస్తున్న వ్యక్తి ఇతనే. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సృజన్ రెడ్డి పేరును పదేపదే ప్రస్తావించారు. “నీ సంకలో తిరుగుతున్న ఉపేందర్ రెడ్డి అల్లుడే సృజన్ రెడ్డి అంటూ” శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ ను ఉద్దేశించి ఆరోపించిన విషయం తెలిసిందే. హరీష్ రావు సృజన్ రెడ్డి పేరు ను పదేపదే ప్రస్తావిస్తున్నప్పటికీ.. కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. గులాబీ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేస్తున్నప్పటికీ.. ఉపేందర్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. సృజన్ రెడ్డిని రేవంత్ రెడ్డి బామ్మర్దిగా పదేపదే ప్రస్తావించడం.. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం.. తెలంగాణ రాజకీయాలలో సంచలనం కలిగిస్తోంది. దీనికి తోడు గులాబీ పార్టీ నేతలు ఈ వ్యవహారాన్ని ఏకంగా గవర్నర్ దాకా తీసుకెళ్లారు.
సృజన్ రెడ్డి పై గులాబీ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ఒక రకంగా కందాల ఉపేందర్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయని తెలుస్తోంది. ఏడాది క్రితమే సృజన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని గులాబీ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఉపేందర్రెడ్డి మౌనంగా ఉండడం వెనక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్లే సృజన్ రెడ్డి మీద గులాబీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తుంటే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు తాను కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదని.. పాలేరు నుంచి బరిలోకి దిగుతానని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే అనేక సందర్భాలలో స్పష్టం చేశారు. అయినప్పటికీ బొగ్గు వ్యవహారంలో సృజన్ రెడ్డిని గులాబీ పార్టీ నేతలు లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నప్పటికీ ఉపేందర్ రెడ్డి స్పందించడం లేదు. దీంతో అటు పాలేరు నియోజకవర్గంలోనే కాకుండా.. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైతం జోరుగా చర్చ నడుస్తోంది. అటు అల్లుడు రేవంత్ రెడ్డి బామ్మర్ది అనే ముద్ర వేసుకోగా.. ఇటు గులాబీ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ఎటూ మాట్లాడలేని పరిస్థితిలో ఉపేందర్ రెడ్డి ఉన్నారు.