Sanju Samson performance: టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంటే అంత ఈజీ కాదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో స్థానం కోసం చాలామంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. కొన్ని సందర్భాలలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆటగాళ్లకు చోటు లభించడం లేదు.
అన్ని అర్హతలు ఉన్నప్పటికీ చోటు లభించక ఇబ్బంది పడిన ప్లేయర్ల జాబితాలో సంజు శాంసన్ కూడా ఉంటాడు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ ఆటగాడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటాడు. వికెట్ల వెనక గోడ మాదిరిగా ఉంటాడు. అత్యంత కఠినమైన క్యాచ్ లు సైతం పట్టుకుంటాడు. రెప్పపాటు వేగంలో రన్ అవుట్ చేస్తుంటాడు. అప్పట్లో ఇతడు వేగాన్ని చూసి చాలా మంది ధోని వారసుడు వచ్చాడని అనుకున్నారు. ఆ తర్వాత సరిగా ఆడలేక పోవడంతో జట్టుకు దూరం కావాల్సి వచ్చింది.
సరిగా ఏడాది క్రితం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో సంజు శాంసన్ అదరగొట్టాడు. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. ఏకంగా సెంచరీలు కూడా సాధించాడు. దీంతో ఒక్కసారిగా అతడు లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఫలితంగా అతనికి టి20 జట్టులో సుస్థిరమైన స్థానం ఏర్పడింది. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. ఆకట్టుకోవాల్సిన అతడు విఫలమవుతున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్లో సంజు శాంసన్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు అతడు మూడు మ్యాచ్లు ఆడాడు. తొలి మ్యాచ్లో పది పరుగులు, రెండో మ్యాచ్లో ఆరు పరుగులు, మూడో మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఇలా అతడు వరుసగా విఫలం కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంజు శాంసన్ ను పక్కన పెట్టాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.. వాస్తవానికి సంజుకు మేనేజ్మెంట్ ఓపెనర్ గా అవకాశం ఇస్తోంది. అభిషేక్ శర్మ రెండో మ్యాచ్లో విఫలమైనప్పటికీ.. మొదటి, మూడో మ్యాచ్లో అదరగొట్టాడు. మెరుపు వేగంతో హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. కానీ, సంజు విఫలమవుతున్నాడు. టి20 వరల్డ్ కప్ ముందు సంజు ప్రదర్శన పట్ల మేనేజ్మెంట్ ఏమాత్రం సానుకూల దృక్పథంతో లేదు. అతడు ఇలాగే తన విఫల ప్రదర్శన చేస్తే టి20 వరల్డ్ కప్ లో రిజర్వ్ బెంచ్ కే పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరి నాలుగో మ్యాచ్ లో నైనా సంజు ఆకట్టుకుంటాడా? తన పూర్వపు ఫామ్ అందుకుంటాడా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.