Apple : ప్రపంచ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ మార్కెట్‌లో రేర్ ఎర్త్ మెటల్స్ ఒక పెద్ద సమస్యగా మారాయి. ఈ మెటల్స్ సరఫరా కోసం చాలా కంపెనీలు చైనా మీద ఆధారపడుతున్నాయి. అయితే, చైనా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలకు సప్లై చైన్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిలో దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ఎంపీ మెటీరియల్స్‌తో 500 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఎందుకు అంత ముఖ్యమో వివరంగా తెలుసుకుందాం.
రేర్ ఎర్త్ మెటల్స్ సరఫరాలో చైనా దాదాపు గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. కానీ, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఈ సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మెటల్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఒకే ఒక రేర్ ఎర్త్ మెటల్స్ గనిని నిర్వహిస్తున్న ఎంపీ మెటీరియల్స్ సంస్థకు డిమాండ్ పెరిగింది. ఇటీవలే అమెరికా రక్షణ శాఖ కూడా ఈ కంపెనీతో ఒక భారీ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు యాపిల్ కూడా ఎంపీ మెటీరియల్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో దాని షేర్ల విలువ రెట్టింపు అయింది. ఇది చైనాకు ఒక పెద్ద సవాలుగా మారింది.
ఒప్పందంలో కీలక అంశాలను గనుక పరిశీలిస్తే.. ఈ ఒప్పందం వల్ల యాపిల్‌కు రేర్ ఎర్త్ మెటల్స్ నిరంతర సరఫరా లభిస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా యాపిల్ 2027లో సరఫరా మొదలైన తర్వాత ఎంపీ మెటీరియల్స్‌కు 200 మిలియన్ డాలర్లను అడ్వాన్స్‌గా చెల్లిస్తుంది. ఇది ఎంపీ మెటీరియల్స్‌కు ఆర్థికంగా బలం చేకూరుస్తుంది. ఈ ఒప్పందంలో ఓ ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎంపీ మెటీరియల్స్ రీసైకిల్ చేసిన పదార్థాల నుంచి కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ను ఉత్పత్తి చేసి యాపిల్‌కు సరఫరా చేస్తుంది. ఈ మెటల్స్ ను టెక్సాస్‌లోని ఎంపీ మెటీరియల్స్ ప్లాంట్‌లో తయారు చేస్తారు.. అయితే అందుకు కావాల్సిన ముడిసరుకును కాలిఫోర్నియాలోని మౌంటైన్ పాస్ గని నుంచి సేకరిస్తారు.
యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యాపార ప్రపంచంలో చాలా తెలివైన నిర్ణయం అని అంటున్నారు. ప్రస్తుతం చైనాపై ఆధారపడడం వల్ల భవిష్యత్తులో సప్లై చైనులో పెద్ద సమస్యలు రావచ్చని వారు భావిస్తున్నారు. యాపిల్ ఈ ఒప్పందం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ.. భవిష్యత్తులో ఉత్పత్తుల తయారీకి కీలకమైన ఈ మెటల్స్ సరఫరాకు ఆటంకం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు. ఈ ఒప్పందం అమెరికాలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కూడా సాయపడుతుంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ.. అడ్వాన్సుడ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ తయారీకి రేర్ ఎర్త్ మెటల్స్ చాలా ముఖ్యమని ఇక మీదట చైనా మీద ఆధారపడాల్సిన అవసరం రాదని ఆయన అన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు రేర్ ఎర్త్ మెటల్స్ సరఫరా చేయకుండా తామే దిక్కని విర్రవీగుతున్న చైనాకు వరుసగా అన్ని దేశాలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.