Andhra Pradesh Population Growth Scheme: ఏపీలో( Andhra Pradesh) జనాభా పెరుగుదలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. వీలైనంతవరకు ఎక్కువ మందిని కనాలని ఆయన సూచిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రెండు, మూడో సంతానాలకు సంబంధించి.. ప్రసవాలకు ప్రోత్సాహం కింద 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా జనాభా పెరుగుదలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో కుటుంబ పురోగతి విషయంలో కీలక సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో వృద్ధుల రేటు పెరుగుతుండడం.. యువత రేటు తగ్గుతుండడంతో దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై పడుతోంది. అందుకే ఇప్పుడు జనాభా పెరుగుదల పై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే జనాభా నియంత్రణతో చైనా, జపాన్ లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే ఆ దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి జనాభా పెరుగుదల కోసం. ఇప్పుడు అదే బాట ఏపీ ప్రభుత్వం పట్టడం విశేషం.
* పడిపోయిన జననాల రేటు..
ప్రస్తుతం రాష్ట్రంలో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. 2.1% వృద్ధి ఉండాల్సి ఉండగా.. 1.5 ఐదు మాత్రమే ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఇప్పటికే యువత తగ్గుముఖం పట్టగా.. నడివయస్కులతో పాటు వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. పనిచేసే వారు తక్కువవుతున్నారు. శ్రమ శక్తి తగ్గుతోంది. మరోవైపు రాష్ట్రంలో 58 శాతం మంది ఒక్క సంతానానికి పరిమితం అవుతున్నారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. శ్రమ శక్తి తగ్గుతుండడంతో కుటుంబ ఆర్థిక భారం పెరుగుతోంది. కుటుంబంలో పనిచేసే వారు తక్కువ కావడంతో వృద్ధిరేటు తగ్గుతోంది. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ప్రమాదం తప్పదు. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.
* స్థానిక ఎన్నికల్లో పోటీకి మినహాయింపు..
ఇప్పటికే సంతానం విషయంలో అనేక రకాల మినహాయింపులు మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. గతంలో ఇద్దరు హద్దు ఒకరు ముద్దు అన్నట్టు నినాదం కొనసాగేది కుటుంబ నియంత్రణ విషయంలో. కానీ ఇప్పుడు ఎంతమంది వీలైతే అంతమంది పిల్లలను కనాలని సూచిస్తుంది ప్రభుత్వం. గతంలో ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హత వేటు పెట్టింది. కానీ ఇప్పుడు ఆ నిబంధనను సడలించి ఎంతమంది పిల్లలు ఉన్నా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇలానే పరిస్థితి కొనసాగితే ఇద్దరు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులు అనే నిబంధన తెచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే నిన్ననే శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. రెండు, ఆపై ఎక్కువ సంతానాలకు సంబంధించి ప్రసవాలకు 25 వేల రూపాయల చొప్పున ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదల కోసమే ఈ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు.