AB Venkateswara Rao : గత ప్రభుత్వంలో తీవ్ర వేధింపులకు గురైన మాజీ ఐపీఎస్ అధికారి ఏ.బి. వెంకటేశ్వరరావుకు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. 2014లో చంద్రబాబు హయాంలో కీలక బాధ్యతల్లో పనిచేసిన వెంకటేశ్వరరావును, 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనను సర్వీసులోంచి తొలగించి సస్పెండ్ చేయడమే కాకుండా, పలు కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు.
ఈ వేధింపులపై ఏబీ వెంకటేశ్వరరావు న్యాయం కోసం చేయని ప్రయత్నం లేదు. కేంద్రం నుంచి కోర్టుల వరకూ తిరిగారు. అయితే, ఎట్టకేలకు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆయనకు న్యాయం దక్కింది. ఇప్పుడు ఆయనపై ఉన్న కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-కేసుల ఉపసంహరణకు హైకోర్టు తీర్పు ఆధారం
మాజీ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) ఏ.బి. వెంకటేశ్వరరావుపై ఉన్న కేసులన్నీ విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైకోర్టు ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్‌లను రద్దు చేయడంతో ఈ కీలక నిర్ణయం వెలువడింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్ మంగళవారం జీవో నెం.1334ను జారీ చేశారు. ఈ జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం, వెంకటేశ్వరరావుపై ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) నమోదు చేసిన కేసులో ఐపీసీ సెక్షన్‌లు 120-బి (క్రిమినల్ కుట్ర), 420 (మోసం), 409 (నమ్మకద్రోహం), అలాగే అవినీతి నివారణ చట్టంలోని కొన్ని సెక్షన్లను ప్రయోగించినప్పటికీ, హైకోర్టు వాటన్నింటినీ కొట్టివేసిందని స్పష్టం చేశారు.
-సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని ప్రభుత్వ నిర్ణయం
వెంకటేశ్వరరావు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విజయవాడలోని ఎస్పీఈ, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఛార్జ్‌షీట్‌ను కూడా రద్దు చేసింది. ఈ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయవద్దని, ఇకపై ఎలాంటి చట్టపరమైన లేదా పరిపాలన సంబంధిత చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ జీవోతో పాటు, వెంకటేశ్వరరావుపై ఇప్పటికే కొనసాగుతున్న అన్ని అధికార విచారణలు కూడా నిలిపివేయబడ్డాయి. దీంతో ఆయనకు పూర్తిగా ఊరట లభించినట్లైంది. జగన్ హయాంలో అనుభవించిన కష్టాల నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఊరటతో ఏబీ వెంకటేశ్వరరావుకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు.