CM Revanth Reddy : మూసి నది పరిరక్షణలో భాగంగా కొద్దిరోజుల నుంచి.. హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను అధికారులు పడగొడుతున్నారు. గృహాలను నిర్మించుకున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో కొంతమందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించారు. ప్రభుత్వం తరఫున పరిహారం కూడా ఇస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఆందోళన చేస్తోంది. తమ గతంలోనే వ్యర్థ జలాల శుద్ధికరణ ప్రాజెక్టు ప్రారంభించామని.. అది ఉండగా మూసీ నది పరిరక్షణ దేనికని ప్రశ్నిస్తోంది. మూసీ నది పరిరక్షణ అనేది పెద్ద స్కామ్ అని.. ఢిల్లీ పెద్దలకు మూటలు మోయడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి పనిచేస్తున్నారని భారత రాష్ట్రసమితి నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. మూసినది పరిరక్షణ ఆగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నదిని కాపాడే బాధ్యతను తాను తీసుకుంటున్నానని.. ఈ పని ఇప్పుడు చేయకపోతే భవిష్యత్తు తరాలు తనను క్షమించమని రేవంత్ రెడ్డి పదేపదే స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మూసీ నది పరిరక్షణ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్న నేపథ్యంలో అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు.. అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. మూసి వెంట నివాసం ఉంటున్న వారి ఇళ్లను పడగొడుతున్నారు.
ముఖ్యమంత్రి ఇల్లు కావాలి
మూసినది పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఇళ్లను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఇల్లు కోల్పోయిన ఓ యువతీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.. కర్ణాటక నుంచి వచ్చిన యువతి ఇక్కడే స్థిరపడింది. తన కుటుంబంతో కలిసి చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నది. కష్టపడి స్థలం కొనుగోలు చేసింది. అందులో ఇల్లు కూడా నిర్మించింది. బ్యాంకు ఆ ఇంటి కోసం రుణం కూడా ఇచ్చింది. ఆ కర్ణాటక యువతికి తెలుగు కూడా స్పష్టంగా వస్తుంది.. అయితే ఆ యువతి ఇల్లు ఇప్పుడు మూసినది పరిరక్షణలో భాగంగా అధికారులు పడగొడుతున్నారు. ఇందుకు పరిహారంగా ఆమెకు నగదు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ తనకు పరిహారం వద్దని.. తన ఇంటికి బదులుగా ఇల్లు కావాలని.. అవసరమైతే ముఖ్యమంత్రి నివసించే ఇల్లు కావాలని కోరుతోంది. మీడియా ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారాయి..” నాకు పరిహారం వద్దు. ఇంటికి బదులుగా ఇల్లు కావాలి. నేను ఇల్లు కోల్పోతున్నాను కాబట్టి ముఖ్యమంత్రి ఇల్లు నాకు ఇస్తారా.. అలా ఇస్తే రేపే నేను ఈ ఇంటిని ఖాళి చేస్తాను. అలాంటి భరోసా మీరు ఇవ్వగలరా.. అలా ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని” ఆ యువతి వ్యాఖ్యానించింది.. అయితే ఈ వీడియోను భారత రాష్ట్ర సమితి నాయకులు తమ సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బాధితుల గోడు ప్రభుత్వానికి ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మూసి ప్రాజెక్టు బాధితుల విషయంలో ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.
నా ఇల్లు ఇస్తా గాని.. నాకు పరిహారం వద్దు.. @revanth_anumula గారి ఇల్లు కావాలట.. మూసి నది పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తొలగిస్తున్న ఈ మా ఇంటికి బదులుగా ఇల్లు కావాలట. ఈమె కర్ణాటక నుంచి వచ్చిన మహిళ. హైదరాబాదులో స్థిరపడ్డారు. తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. pic.twitter.com/DXRuoERhpi
— Anabothula Bhaskar (@AnabothulaB) November 18, 2024