Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం మొండ్రాయి తండాకు చెందిన పల్లవికి ఏడాది క్రితం వివాహమైంది. అయితే 9 నెలల క్రితం తాను గర్భం దాల్చినట్టు పల్లవి భర్తతో చెప్పింది. దీంతో అతడు సంతోషంతో తండా మొత్తం మిఠాయిలు పంచాడు. తన వంశాంకురం పుట్టబోతున్నాడని సంబరపడ్డాడు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. అత్తామామలతో చెప్పి సంబరపడ్డాడు. ఈ క్రమంలో ప్రతినెలా పల్లవిని జనగామలో ని ఓ ఆసుపత్రిలో చూపిస్తున్నాడు. క్రమం తప్పకుండా మందులు కొనుగోలు చేస్తూ… భార్యతో వాడిస్తున్నాడు. అయితే అప్పట్లో స్కానింగ్, ఇతర పరీక్షలు చేయాలని వైద్యులు సిఫారసు చేస్తే.. దానికి పల్లవి ఒప్పుకోలేదు. అలా స్కానింగ్ చేస్తే పుట్టబోయే బిడ్డ పై రేడియేషన్ పడుతుందని తన భర్తను నమ్మించడంతో.. నిజమేనని నమ్మిన అతడు అలా చూపించలేదు. అప్పట్లో పల్లవి వ్యవహరించిన తీరు ఆసుపత్రి వైద్యులకు చిత్రంగా అనిపించినప్పటికీ.. ఆమెకు భర్త అండగా ఉండడంతో ఏమీ అనలేకపోయారు.
పురిటి నొప్పులు వస్తున్నాయని..
ఇక బుధవారం తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని పల్లవి కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో వారు హుటాహుటిన జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మలవిసర్జనకు వెళ్తానని చెప్పి.. అర్థగంట తర్వాత వచ్చింది. అయితే తనకు బాత్రూంలోనే గర్భ స్రావం అయిందని.. బాత్రూంలోనే తనకు బాబు పుట్టి చనిపోయాడని.. అతడు డ్రైనేజీలో పడిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. ఆమె చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన ఆసుపత్రి సిబ్బంది డ్రైనేజీ పరిసర ప్రాంతాలలో పరిశీలించారు.. ఎంతసేపటికి బాబు ఆచూకీ లభించలేదు. ఆనవాలు కూడా దొరకలేదు. దీంతో సిబ్బంది ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. చివరికి ఆమె గర్భం కూడా దాల్చలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి ఆ మహిళను విచారించారు. అయితే వివాహం జరిగే రెండు సంవత్సరాలైనా గర్భం దాల్చకపోవడంతో… భర్త, కుటుంబ సభ్యులు పదేపదే నిలదీయడంతో.. తాను ఈ పని చేయాల్సి వచ్చిందని ఆ మహిళ వాపోయింది. ఈ సంఘటన జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రిలో సంచలనం సృష్టించింది. పోలీసులు రావడంతో ఆసుపత్రిలో కలకలం నెలకొంది. ముందుగా పోలీసులు వచ్చి విచారిస్తుండగా ఆ మహిళ వారికి సహకరించలేదు. ఆ తర్వాత గట్టిగా బెదిరించడంతో ఏడుపు మొదలుపెట్టింది. అనంతరం వారిదైన శైలిలో ప్రశ్నలు అడగగా ముక్తసరిగా సమాధానం చెప్పింది. గతంలో స్కానింగ్ తీసేందుకు ప్రయత్నించగా ఒప్పుకోలేదని.. అప్పట్లోనే మేము గట్టిగా నిలదీస్తే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదని ఆ మహిళ భర్త అంతర్గత సంభాషణలో వ్యాఖ్యానిచ్చినట్టు తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More