Photo Story: గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో రాణించడం అంత సులభం కాదు. తిరుగులేని టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే నిలదొక్కుకుంటారు. నటుడిగా ఎదిగే క్రమంలో చేతికి వచ్చిన ప్రతి పాత్ర చేస్తారు. తమను తాము నిరూపించుకుంటారు. పైన ఫోటోలో హీరో ధనుష్ వెనకున్న నటుడు ఎదిగిన తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. అరడజనుకు పైగా చిత్రాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు చేశాడు. చిన్న చిన్న పాత్రల్లో తన ప్రతిభ చూపి దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు.
సపోర్టింగ్ రోల్స్ నుండి కీలక పాత్రల స్థాయికి వచ్చాడు. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో తన నట విశ్వరూపం చూపించాడు. హీరోగా చేయగలడు అని నిరూపించుకున్నాడు. ఆ నటుడు ఎవరో కాదు విజయ్ సేతుపతి. తమిళనాడు రాష్ట్రంలోని రాజపలయంలో జన్మించిన విజయ్ సేతుపతి నటుడు కావాలనే మక్కువతో చెన్నైకి వచ్చాడు. వేషాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాడు. 1996లో విడుదలైన లవ్ బర్డ్స్ మూవీలో ఒక చిన్న పాత్ర చేశాడు. ఆ మూవీలో ప్రభుదేవా, నగ్మా హీరో హీరోయిన్ గా నటించారు. అదే ఏడాది గోకులతిల్ సీతై చిత్రంలో అన్ క్రెడిట్ రోల్ చేశాడు.
తర్వాత ఎనిమిదేళ్ల వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. 2004లో తిరిగి ఇండస్ట్రీకి వచ్చాడు. 2010 వరకు అడపాదడపా చిత్రాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు చేశాడు. శశి కుమార్ హీరోగా నటించిన సుందరపాండియన్ బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో కీలక రోల్ చేసిన విజయ్ సేతుపతి తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. 2012లో విడుదలైన ఫిజ్జా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ఫిజ్జా సంచలన విజయం అందుకుంది. విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫిజ్జా చిత్రంలో నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. హీరోగా వరుస చిత్రాలు చేశాడు. హీరో పాత్రలకే కట్టుబడకుండా ఆయన విలక్షణ రోల్స్ చేస్తున్నారు. అందుకే ఆయన పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు.
తెలుగులో సైరా నరసింహారెడ్డి లో ఓ కీలక రోల్ చేశాడు. ఉప్పెన మూవీలో కరుడుగట్టిన విలన్ పాత్రలో మెప్పించాడు. హిందీలో కూడా చిత్రాలు, వెబ్ సిరీస్లు చేశాడు. ఇండియా వైడ్ విజయ్ సేతుపతికి ఫేమ్ ఉంది. సూపర్ డీలక్స్ చిత్రంలోని నటనకు గానూ విజయ్ సేతుపతి సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో జాతీయ అవార్డు అందుకున్నారు. విజయ్ సేతుపతి జర్నీ చాలా మంది స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.