
Woman Cheats Army Man: అందంగా ఉంటుంది.. నవ యవ్వనపు వయసు.. చూడగానే ఓకే చెబుతారు. కానీ ఈ మాయలేడి తన అందంతో ప్రేమ వల విసురుతూ పెళ్లి చేసుకొని కొద్దిరోజులు కాపురం చేసి వారి వద్ద ఉన్నదంతా ఊడ్చేసి చెక్కేస్తుంది. కనిపించకుండా పోతుంది. దీంతో నవ వరుడులు తమ కొత్త భార్య కోసం మొత్తం వెతికి విసిగి వేసారిపోతారు. కొందరు మోసం చేసిందని గమ్మున ఊరుకున్నారు.
తాజాగా ఒక ఆర్మీ మ్యాన్ కు ఇలాగే బురిడీ కొట్టించింది. అతడిని పెళ్లి చేసుకొని అతడితోపాటు లక్నో వెళ్లింది. అక్కడ బంగారు,నగలు, నగదు దాదాపు రూ.90 లక్షల వరకు తీసుకొని సొంతూరుకు వచ్చింది. ఆర్మీ మ్యాన్ కు సంసార సుఖాన్ని అందించి కొద్దిరోజులు ఎంజాయ్ చేసి వచ్చేసింది. మోసపోయానని గ్రహించిన ఆర్మీ మ్యాన్ లబోదిబోమన్నాడు.
ఈ క్రమంలోనే ప్రేమించి.. పెళ్లి చేసుకొని తనను మోసం చేసిన యువతిపై ఆర్మీ ఉద్యోగి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు.
గత ఏడాది డిసెంబర్ లో ఆర్మీలో జవానుగా పనిచేసే ప్రసాద్ చినగంట్యాడకు చెందిన యువతిని పెళ్లి చేసుకొని లక్నో తీసుకెళ్లాడు. అక్కడే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనిపించుకొని దఫదఫాలుగా రూ.90 లక్షల వరకు యువతి తీసుకొంది. అనంతరం గాజువాకకు వచ్చేసింది. మళ్లీ తిరిగి రాకపోవడంతో బాధితుడు గాజువాక వచ్చి విచారించారు.
దీంతో అంతకుముందే ఆమెకు అగనంపూడి, గాజువాకకు చెందిన ఇద్దరు యువకులతో పెళ్లిళ్లు అయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. నిందితురాలిపై ఐపీసీ 420, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఇలా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని వారికి స్వర్గంచూపి వారివద్దనున్న సొమ్ము, బంగారం తీసుకొని ఉడాయిస్తున్న ఈ యువతి వ్యవహారం ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది.