Telangana Hydra : విశ్వనగరం హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలని, ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా..(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ). ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసింది. తర, తమ బేధం లేకుండా అక్రమ నిర్మాణం అయితే హైడ్రా బుల్డోజర్లు కనికరం చూపడం లేదు. ఇప్పటికే వందలాది అక్రమ కట్టడాలకు కూడా నోటీసులు ఇచ్చింది. చివరకు సీఎం సోదరుడి ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచి‍్చంది. హైడ్రాపై కొందరు విమర్శలు చేస్తున్నా.. సామాన్యుల నుంచి మాత్రం మద్దతు లభిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా హైదరాబాద్‌లో ఆక్రమణలను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానాలకు వెళ్లినా కోర్టుల్లో కూడా పోరాడతామని తెలిపారు. హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇస్తామని కూడా పేర్కొంటున్నారు.
ఆగని కూల్చివేతలు..
హైడ్రా దూకుడుపై ఎన్ని విమర్శలు వస్తున్నా… కూల్చివేతలు మాత్రం ఆగటం లేదు. పక్కా సమాచారంతో, పోలీస్ ప్రొటెక్షన్‌తో కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి. సీఎం కూడా హైడ్రా ఆగదు, చెరువులను కబ్జా కోరల నుంచి కాపాడుతుంది అని హెచ్చరిస్తున్నారు. కొంతమంది నేతలు, సంపన్నులే చెరువులు, కుంటలు, కాలువలను కబ్జా చేసి విల్లాలు, ఫాం హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. డ్రెయినేజీ నీరంతా మూసీలోకి వదులుతున్నారని పేర్కొన్నారు. దీంతో నల్గొండ జిల్లాపైనా ప్రభావం పడుతోందని తెలిపారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఇప్పటి వరకు ఏకంగా 262 భవనాలను నేలమట్టం చేసింది. మొత్తం 117.72 ఎకరాలను కబ్జాల నుంచి కాపాడినట్లు తెలిపింది. మొత్తం 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు ప్రకటించింది. ఇక ఇందులో అత్యధికంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్, పరిసర ప్రాంతాల్లోనే జరిగాయి.
జూన్ 27 నుంచి కూల్చివేతలు..
హైడ్రా జూన్ 27 నుంచి తన పని మొదలు పెట్టింది. కూల్చివేతలు ప్రారంభించింది. 15 రోజుల క్రితం వరకు 43 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన హైడ్రా తాజాగా 117.72 ఎకరాలకు కబ్జా నుంచి విముక్తి కల్పించామని తెలిపింది. అత్యధికంగా గాజుల రామారం చింతలబస్తీ చెరువు బఫర్ జోన్లో 54 నిర్మాణాలు నేలమట్టం అయ్యాయని పేర్కొంది. తర్వాత రాజేంద్రనగర్, మాదాపూర్‌లోని చెరువుల్లోని బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. ఇక హైడ్రాకు మరిన్ని పవర్ ఇచ్చేలా సీఐ, ఎస్సై స్థాయి అధికారులను హైడ్రాకు కేటాయించింది పోలీస్ శాఖ.
నిర్మాణానికి హైడ్రా అనుమతి..
ఇదిలా ఉంటే.. భవిష్యత్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే వ్యవస్థల్లో హైడ్రాను కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత కల్పించారు. కొత్త నిర్మాణాలకు హైడ్రా అనుమతి తీసుకునేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.