https://oktelugu.com/

KCR Bus Yatra: జగన్‌ బాటలో కేసీఆర్‌.. బస్సు యాత్ర పార్టీకి బలం తెస్తుందా?

ఒకవైపు ఓటమి.. ఇంకోవైపు కీలక నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండడంతో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ఈ తరుణంలో కార్యకర్తలను కాపాడుకునేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 17, 2024 / 12:53 PM IST

    KCR Bus Yatra

    Follow us on

    KCR Bus Yatra: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌ ఆశలు ఆడియాసలయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడమే కష్టంగా మారింది. ఓటమి తర్వాత పార్టీ నేతలతోపాటు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఎల్పీ మొత్తం కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈతరుణంలో అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీలో జవజత్వాలు నింపడం కోసం అధినేత కేసీఆర్‌ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలలోకి వెళుతున్న గులాబీ బాస్‌.. ఏపీ సీఎం జగన్ తరహాలో త్వరలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.

    పార్టీ శ్రేణుల్లో జోష్‌ కోసం..
    ఒకవైపు ఓటమి.. ఇంకోవైపు కీలక నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండడంతో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ఈ తరుణంలో కార్యకర్తలను కాపాడుకునేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని భావిస్తున్నారు. హామీలు అమలు చేసేదాకా వెంటపడతామని చెప్పిన కేసీఆర్, వైఫల్యాలను ఎత్తి చూపడంతోపాటు హామీలు నెరవేర్చేలా ఒత్తిడి చేయాలని, కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు.

    రేపే కీలక సమావేశం..
    బస్సు యాత్ర నేపథ్యంలో ఏప్రిల్‌ 18న పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు కేసీఆర్‌. ఈ సమావేశంలోనే బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో లోక్‌ సభ ఎన్నికలకు ఎలా ప్రజలవద్దకు వెళ్లాలి అన్న అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకుకోనున్నారు.

    రైతు ఎజెండాతోనే..
    ఇక కేసీఆర్‌ చేసే బస్సు యాత్ర రైతు ఎజెండాగానే ఉండబోతుందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ వచ్చాక కరువు వచ్చిందని, రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగడం లేదని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువని విమర్శిస్తోంది. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్‌ను మరింత ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో అసమర్థ పాలనను టార్గెట్‌ చేసి కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టాలని భావిస్తున్నారు.