Revanth Reddy Meet Vemuri Radhakrishna: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నూతన సంవత్సర సందర్భంగా సచివాలయంలో అన్ని శాఖల అధికారులు కలుస్తారు. ఆయన నివాసంలో హై ప్రొఫైల్ వ్యక్తులు మీట్ అవుతుంటారు. కర్టసి కాల్ ప్రకారం పుష్పగుచ్చాలు అందిస్తుంటారు. స్వీట్ బాక్సులు.. ఇంకా రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. ఇది ప్రతి ఏడాది జరిగేదే. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి సన్నివేశాలు సచివాలయంలో ఒక వేడుకలాగా జరిగేవి. కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆ స్థాయిలో ఆడంబరాలకు పోవడం లేదు. జస్ట్ ఒక కామన్ మ్యాన్ లాగానే ఆయన ప్రవర్తిస్తున్నారు.
గురువారం నూతన సంవత్సరం సందర్భంగా రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనకు రాధాకృష్ణ స్వాగతం పలికారు. రాధాకృష్ణ అల్లుడు భాను ప్రకాష్, కొడుకు ఆదిత్య ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, రాధాకృష్ణ ఇంటికి ఇప్పటికిప్పుడు రేవంత్ ఎందుకు వెళ్లారనేది తెలంగాణ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. దానికంటే ముందు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదే ఊపులో ఇప్పుడు పురపాలకం, నగర పాలకం ఎన్నికలు నిర్వహించబోతోంది. ఈ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు సాధిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పుడిక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గులాబీ పార్టీ ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో.. దాని గురించి శాసనసభలోనే మాట్లాడుతామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇక గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్, హరీష్ రావు మీద రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారిద్దరిని ఉరితీసినా కూడా తప్పులేదని అన్నారు. సరిగ్గా రెండు రోజుల క్రితం బనకచర్ల నల్లమల సాగర్ నిర్మాణానికి సంబంధించి సి డబ్ల్యూ సి ఒక కీలక నివేదికను బయటపెట్టింది. ఇది కాస్త గులాబీ పార్టీకి అనుకూలంగా మారింది. ఇంకేముంది సిడబ్ల్యుసి వెల్లడించిన ఉత్తర్వును అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడింది. హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి తెలంగాణలో చంద్రబాబు పరిపాలన సాగుతోందని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మండిపడ్డారు.
సహజంగా ఇటువంటి పరిణామాలు సంబంధించినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే తన అంతరంగీకులతో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డికి అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో వేమూరి రాధాకృష్ణ ఒకరు. బహుశా అందువల్లే నూతన సంవత్సర సందర్భంగా కలిసి ఉంటారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారని.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాధాకృష్ణకు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన రాజకీయ భవిష్యత్తు ముఖ చిత్రాన్ని వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫలితాలు సాధించారు.
ఇప్పుడిక పాలమూరు రంగారెడ్డి, బనకచర్ల నల్లమల సాగర్ వ్యవహారాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. రాధాకృష్ణను రేవంత్ రెడ్డి కలిశారు. మరి ఈ సమయంలో రేవంత్ రెడ్డికి రాధాకృష్ణ ఏం సలహాలు ఇచ్చారు? వాటిని రేవంత్ రెడ్డి పాటిస్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అన్నట్టు వీరిద్దరి కలయికను గులాబీ పార్టీ అనుకూల మీడియా.. సోషల్ మీడియా వేరే విధంగా రాస్తోంది. అప్పట్లో రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే కేసీఆర్ ఆయనను పరామర్శించారు. అప్పట్లో కెసిఆర్ తో సంబంధ బాంధవ్యాలు బాగుండేవి కాబట్టి కొద్ది రోజులపాటు తన పత్రికలో ఎటువంటి నెగటివ్ వార్తలు రాకుండా చూసుకున్నాడు రాధాకృష్ణ. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.. సమర శంఖం పూరించాడు. ఇప్పుడిక రేవంత్ తో ఇదిగో ఇలా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. కాకపోతే కెసిఆర్ తో చెడినట్టు రేవంత్ రెడ్డితో రాధాకృష్ణకు స్నేహం చెడిపోదు. ఇలా ఎందుకు జరగదో లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు.
