Teenmar Mallanna: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల జోష్‌ను లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరో జాతీయ పార్టీ బీజేపీ సిట్టింగ్ స్థానాలను డబుల్ చేసుకోవాలని చూస్తోంది. ఇక పదేళ్లు అధికారంలో ఉండి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ 9 మందిని ప్రకటించగా, బీఆర్‌ఎస్ 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తోంది.
కరీంనగర్‌పై దృష్టి..
లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ సీటుపై అందరి దృష్టి పడింది. ఇక్కడి నుంచి ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బలమైన బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు. వెలమ నేతను ఓడించిన బీసీగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాడు కేసీఆర్ చేసిన హిందుగాడు, బొందుగాడు వ్యాఖ్యలు బండి సంజయ్ విజయంలో కీలకంగా మారాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ మూడోస్థానానికి పరిమితమయ్యాడు.
తాజాగా ఆ ఇద్దరే..
ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ సంజయ్, బీఆర్‌ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్ పోటీ చేయడం ఖాయమైంది. ఈమేరకు రెండు పార్టీలు టిక్కెట్లు ప్రకటించాయి. ఇక ఈ ఇద్దరినీ డీకొట్టి గెలిచే నేతల కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇక్కడి నుంచి వెలిచాల రాజేందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, పురుమళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ ముగ్గురికీ బలమైన బండి సంజయ్‌ను ఢీకొట్టే సత్తా లేదు. దీంతో బలమైన అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది.
కాపు అస్త్రం..
కరీంనగర్‌లో కాపు ఓటర్లు ఎక్కువ. ఈ సామాజికవర్గం ఓట్లు 3 లక్షల వరకు ఉంటాయని అంచనా. దీంతో కాంగ్రెస్ కాపు అస్త్రం ప్రయోగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను బరిలో దించాలని భావిస్తోంది. బండి సంజయ్ మున్నూరు కాపు నేత. తీన్మార్ మల్లన్న కూడా కాపు సామాజికవర్గం నేత. దీంతో కాపుల ఓట్లు చీలుతాయని, మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌కే వస్తాయని హస్తం నేతలు భావిస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు కరీంనగర్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. క్యూన్యూస్ ద్వారా ఆయన కరీంనగర్ ప్రజలకు దగ్గరయ్యాడు. ఇవి కూడా ఆయన ప్లస్ పాయింట్‌గా కాంగ్రెస్ బావిస్తోంది.
తీన్మార్ మల్లన్న నేపథ్యం..
తీన్మార్ మల్లన్న ప్రముఖ తెలుగు జర్నలిస్ట్, అతను 1982లో తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ‘భాగయ్య మరియు జానమ్మ‘ అతనికి ‘చింతపండు నవీన్ కుమార్‘ అని పేరు పెట్టారు. అతని తండ్రి పాల వ్యాపారి. తల్లి గృహిణి.
ఉన్నత విద్యావంతుడు..
ఇక తీన్మార్ మల్లన్న ఉన్నత విద్యావంతుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
రాజకీయ నేపథ్యం..
2014 ఎన్నికల ఫలితాలకు ముందు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు తీన్మార్ మల్లన్న కేసీఆర్‌ను ఆయన ఫామ్‌హౌస్‌లో కలిసేందుకు అంగీకరించారు. అయితే తీన్మార్ మల్లన్నను పార్టీతో కలిసి పనిచేయాలని కేసీఆర్ కోరినప్పటికీ ఆయన ఆశించిన ఘనస్వాగతం లభించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.2019లో హుజూర్‌నగర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఓడిపోయారు. 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. 2021లో బీజేపీలో చేరారు. కానీ కొన్ని రోజులే కొనసాగారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో..
2023 అసెంబ్లీ ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో చేరారు. తన క్యూన్యూస్‌లో కాంగ్రెస్ అనుకూలంగా ప్రచారం చేశారు. మేడ్చల్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ ఆశీస్సులు కోరాడు. కానీ రెండు పార్టీలు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు కరీంనగర్ ఎంపీగా టికెట్ ఇస్తారని తెలుస్తోంది.