India vs pakistan : బంతి బంతికి ఉత్కంఠ.. నరాలు తెగే టెన్షన్.. ఏం జరుగుతుందో తెలియని ఆందోళన.. కానీ చివరికి విజయలక్ష్మి భారత జట్టునే వరించింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో పాకిస్తాన్ పై ఆరు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.. మందకొడిగా ఉన్న ఈ మైదానంపై టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ వైపు మొగ్గుచూపింది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రిషబ్ పంత్ (42; 31 బంతుల్లో ఆరు ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లలో నసిమ్ షా(3/21), హరీస్ రౌఫ్(3/21) తో అదరగొట్టారు. మహమ్మద్ అమీర్ (2/23) సత్తా చాటాడు.
120 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది.. బుమ్రా(3/14), హార్దిక్ పాండ్యా (2/24), అర్ష్ దీప్ సింగ్(1/31), అక్షర్ పటేల్) (1/11) సత్తా చాటారు. మహమ్మద్ రిజ్వాన్ (31: 44 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) తో ఆకట్టుకున్నాడు..అర్ష్ దీప్ తొలి ఓవర్ లో పాకిస్తాన్ 9 పరుగులు సాధించింది. ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్లో బాబర్ అజామ్ రెండు ఫోర్ లతో స్వాగతం పలికాడు.. కానీ ఎప్పుడైతే బమ్రా చేతికి బౌలింగ్ వెళ్ళిందో.. అప్పుడే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ స్కోర్ బోర్డు పూర్తిగా నెమ్మదించింది. ఐదో ఓవర్లో బుమ్రా బాబర్ ను ఔట్ చేసి పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చాడు. ఈ దశలో వచ్చిన ఉస్మాన్ ఖాన్ (15) తో కలిసి పాక్ పరిస్థితిని చక్కదిద్దేందుకు రిజ్వాన్ ప్రయత్నించాడు.. ఈ దశల వీరిద్దరూ ఆచితూచి ఆడటంతో పాకిస్తాన్ 10 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 57 రన్స్ చేసింది.. ఈ దశలో పాకిస్తాన్ ఫేవరెట్ గా ఉంది. దీంతో భారత అభిమానుల్లో ఓటమి భయం మొదలైంది.
డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్ అందుకోవడంతో.. పాకిస్తాన్ ఒక్కసారిగా తడబాటుకు గురైంది. 11 ఓవర్ తొలి బంతికే అక్షర్ పటేల్ ఉస్మాన్ ఖాన్ ను ఔట్ చేశాడు. మరో ఎండ్ లో రిజ్వాన్ ఉండడంతో స్కోర్ బోర్డును నెమ్మదిగా పరుగులు పెట్టించాడు.. ఈ దశలో ఫకర్ జమాన్ (13: 8 బంతుల్లో 1 ఫోర్, ఒక సిక్సర్) ధాటిగా ఆడటంతో భారత్ గెలిచే అవకాశాలు లేకపోయాయి. ఈ దశలో బౌలర్లు బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా పుంజుకున్నారు. హార్దిక్ పాండ్యా, బుమ్రా చెలరేగి బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ క్రమంగా వికెట్లు కోల్పోయింది.. చివరి రెండు ఓవర్లలో పాకిస్తాన్ విజయానికి 21 రన్స్ అవసరమయ్యాయి.. ఈ దశలో బుమ్రా కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఇఫ్తికర్ ను అవుట్ చేశాడు.. ఇక చివరి ఓవర్లో తొలి బంతికే అర్ష్ దీప్ ఇమామ్ వసీద్(15: 23 బంతుల్లో ఒక ఫోర్) ను బోల్తా కొట్టించాడు.. చివరి మూడు బంతుల్లో పాకిస్తాన్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. నసీం షా వరుసగా రెండు ఫోర్లు కొట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అంతరం మాత్రమే తగ్గిపోయింది గాని.. పాకిస్తాన్ జట్టుకు ఓటమి తప్పలేదు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ పూర్తిగా తడబడింది.. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (13) వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో.. అక్షర్ పటేల్ (20), రిషబ్ పంత్ భారత ఇన్నింగ్స్ లో చక్కదిద్దారు.. అక్షర్ ఔట్ అయినప్పటికీ… పంత్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. 10 ఓవర్లకు భారత్ అప్పటికి 81/3 పటిష్ట స్థితిలో ఉంది. ఆ తర్వాత 9 ఓవర్లలో 38 పరుగులకే 7 వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది. ఇందులో ఏ ఒక్క వికెట్ నిలబడినా.. భారత జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోరు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ విజయం ద్వారా భారత్ గ్రూప్ ఏ లో టాప్ స్థానంలోకి ఎగబాకింది..