https://oktelugu.com/

Moosey Project : కాంగ్రెస్ మూసీ ప్రాజెక్ట్ చేపట్టడం వెనక కథ ఏంటి? ఎవరికి లాభం.?

మూసీనది సుందరీకరణ, శుద్ధి పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ తో లాభమేం లేదని, రైతులకు కొత్తగా ఒరిగేదేమీ లేదని ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతల దోపిడీ కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టారనే విమర్శలొస్తున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 29, 2024 11:08 am
    Moosey Project

    Moosey Project

    Follow us on

    Moosey Project : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్ట్ ప్రధానంగా హైదరాబాద్ లో నది సుందరీకరణ, నీటి శుద్దికి మాత్రమే పరిమితం. హైదరాబాద్ దిగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నదీ తీరం వెంబడి ఏర్పాటైన పరిశ్రమల నుంచి నదిలో కలిసే వ్యర్ధ రసాయనాలతో నది నీరు పూర్తి కాలుష్యమయమైన, నేపథ్యంలో ఈ కాలుష్యాన్ని నివారించాలని పదే పదే డిమాండ్లున్నా ప్రస్తుత ప్రాజెక్ట్ లో దీన్ని చేర్చలేదు. ప్రధానంగా మూసీ నీటితో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో 23 వరకు కత్వలు, ఆనకట్టల ద్వారా దాదాపు 150 కి పైగా చెరువులు అనుసంధానం అవుతాయి. దిగువన కేతేపల్లి వద్ద మూసీ ప్రాజెక్టు ఉంది. ఈ మొత్తం వనరుల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు నీరు అందుతుంది. అయితే మూసీ నీరు కలుషితమవడంతో ఇక్కడ పండే పంటలకు, కూరగాయలకి, చేపలకి డిమాండ్ లేకుండా పోయింది. ఇంత తీవ్ర ఇబ్బంది ఈ మూసీ రైతాంగం ఎదుర్కొంటున్నా , కాలుష్యాన్ని నివారించడానికి ఈ ప్రాజెక్ట్ లో స్థానం లేకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేని ఈ ప్రాజెక్ట్ కి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కేవలం దోచుకోవడానికేననే ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం వద్ద సమాధానం కొరవడింది.

     సొంత జిల్లా ప్రాజెక్ట్ పాలమూరు- రంగారెడ్డి ని సీఎం రేవంత్ పక్కన పెట్టారా..?
    మూసీ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్ట్ గా చెప్పడం, అదే సమయంలో సీఎం సొంత జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పట్టించుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తుతున్నాయి. పాలమూరు ప్రాజెక్టు లో భాగంగా కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకి నీళ్లిచ్చే కాల్వల పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టింది. ఈ మూడు నియోజకవర్గాల కోసం 2014 లో మంజూరై బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆదరణకు నోచుకోని కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని సీఎం చేపట్టారు. అంతే కాకుండా ఇటీవల పాలమూరు ప్రాజెక్ట్ లో అంతర్భాగమైన వత్తెం ( vattem) పంప్ హౌస్ నీటమునిగితే కనీసం సమీక్ష నిర్వహించకపోవడం వంటి చర్యలు ఈ ప్రాజెక్ట్ ని సీయం రేవంత్ పట్టించుకోవడం లేదనే విమర్శలకు అవకాశం ఇస్తున్నాయి.

     కాళేశ్వరానికి కౌంటర్ గా మూసీ ప్రాజెక్ట్ ని తెరపైకి తెస్తోన్న కేటీఆర్:
    ఒకవైపు మూసీ ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ నేతలకి అక్రమ సంపాదన మినహా వచ్చేదేమీ లేదని పేర్కొనడం, మరో వైపున సొంత జిల్లా ప్రాజెక్ట్ పాలమూరు-రంగారెడ్డి ని సీయం పట్టించుకోవడం లేదనే చర్చ మొదలు పెట్టడం ద్వారా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల క్రెడిట్ తమ ఖాతాలోనే ఉంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అప్పటి బీఆర్ఎస్ ధన దోపిడీకి పాల్పడిందనే ఆరోపణలకి కౌంటర్ గా కాంగ్రెస్ నేతల ధనప్రయోజనాల కోసమే మూసీ ప్రాజెక్ట్ అనే వాదాన్ని బీఆర్ఎస్ నేత తెరపైకి తెచ్చారు. దీనిపై అధికార, ప్రతిపక్షాలు మున్ముందు ఎలా స్పందిస్తాయోననే దానిపైనే రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలు కొనసాగనున్నాయి.