World Heart Day 2024 : ప్రతీ ఏడాది సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎలాంటి ప్రమాదాలు రాకుండా దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్ధతుతో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్‌ను 1999లో ప్రారంభించారు. దీని మొదటి వేడుక కూడా 2000 సెప్టెంబర్ 24న జరిగింది. నిజానికి సెప్టెంబర్ నాలుగో ఆదివారం ఈ ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చివరికి సెప్టెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా హృదయ దినోత్సవాన్ని జరుపుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. ఈరోజుల్లో చాలా మంది గుండె పోటు సమస్యలతో మరణిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండి, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి విముక్తి కలగడానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
ఈ ఏడాది థీమ్ ఏంటంటే?
ప్రత్యేకమైన రోజులకు ప్రతి ఏడాది కొత్త థీమ్‌తో జరుపుకుంటారు. అయితే ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఈ ఏడాది యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ (చర్య కోసం హృదయాన్ని ఉపయోగించండి) అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. 2024 నుంచి 2026 వరకు ఈ థీమ్‌తో జరుపుకోవాలి. ఆరోగ్య విషయంలో గుండెకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. ఇతరులకు కూడా దీనిపై అవగాహన కల్పించాలి.
గుండె సమస్యలపై ప్రజలకు అవగాహన
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది గుండె పోటు ప్రమాదాలతో 18.6 మిలియన్ల మంది మరణిస్తున్నారు. దీనిని నివారించడానికి పాటించాల్సిన చిట్కాలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏటా దీనిని జరుపుకుంటారు. ప్రపంచ హృదయ దినోత్సవం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తూ.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము, గుండె కాస్త నొప్పిగా అనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ కూడా గుండె పోటు సమస్యలకు ప్రభావితం అవుతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే చిన్న వయస్సు ఉన్నవారు కూడా గుండెపోటు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఎలా జరుపుకోవాలంటే?
గుండె సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించాలి. సోషల్ మీడియా ద్వారా ప్రపంచ హృదయ దినోత్సవం గురించి అవగాహన కల్పించాలి. ఇంట్లో పిల్లలకు, పాఠశాలలో విద్యార్థులకు, ఇలా ప్రతి దగ్గర గుండెపోటు రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు తెలియజేయాలి. గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచనలు చేయాలి. డాక్టర్ సహాయంతో ఫుడ్ విషయంలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్, ఒత్తిడి లేకుండా ఉండటం, జీవనశైలిలో మార్పులతో గుండె పోటు ప్రమాదాలను కొంతవరకు తగ్గించవచ్చు.